Nandamuri Taraka Ratna: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో అతిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ పాదయాత్ర అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతోంది. గతంలో నేతలు పాదయాత్రలు చేసిన పార్టీని అధికారంలోకి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పాదయాత్రలతో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పడు ఇదే సెంటిమెంటుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పేరుతో 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. కుప్పంలోని ప్రసన్న వరదరాజుల ఆలయం నుంచి లోకేశ్ తొలి అడుగు సరిగ్గా 11.03 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ర్యాలీగా కుప్పం చేరుకుని లోకేష్‌తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పార్టీ నేతలంతా కుప్పం తరలి వచ్చారు. కుప్పంలో పసుపు జెండాలతో పండగు వాతావరణం కనిపిస్తోంది. మధ్నాహ్నం కుప్పంలో భారీ బహిరంగ సభ జరగనుంది. లోకేష్ యువగళం యాత్ర వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఆల్ ది బెస్ట్ యువగళం పాదయాత్ర’ అంటూ ట్వీట్ చేశారు. అయితే లోకేష్ యాత్రలో తొలగి అడుగులోనే అపశ్రుతి దొర్లింది. యాత్రలో లోకేష్ వెంట నడుస్తున్న హీరో తారకరత్న సొమ్మసిల్లారు. వెంటనే అప్రమత్తమైన లోకేష్, బాలకృష్ణ అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ముహూర్తానికే తొలి అడుగు
ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే లోకేష్ కుప్పంలో తొలి అడుగు వేశారు. 400 రోజుల్లో నాలుగు వేల కిలో మీటర్లు లోకేశ్ యాత్ర కొనసాగనుంది. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ పాదయాత్ర ప్రారంభం వేళ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబు మినహా పార్టీ నేతలంతా కుప్పం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు లోకేశ్‌కు మద్దతుగా తరలి వచ్చారు. యాత్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులతో కుప్పంలో టీడీపీ పండుగ కనిపిస్తోంది. పాదయాత్రలో తొలి రోజు 8.5 కిలో మీటర్ల మేర లోకేష్ నడవనున్నారు. మధ్నాహ్నం బహిరంగ సభ తరువాత యాత్ర కొనసాగనుంది.
పిడికిలి బిగించి ముందడుగు
తొలి రోజు యాత్రలో భాగంగా హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. కొత్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులు ఆర్పించనున్నారు. సాయంత్రం యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోకేష్ తన యాత్ర ప్రారంభ సమయంలో ప్రభుత్వంపైన తన పోరాటం ప్రారంభమైందంటూ పిడికిలి బిగించి కార్యకర్తలకు తన లక్ష్యాన్ని చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు లోకేష్ తో కలిసి తొలి రోజు యాత్రలో పొల్గొంటున్నారు. అందరికీ అభివాదం చేసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.

తారకరత్న ఘటనతో ఆందోళన..
అయితే సాఫీగా ప్రారంభమైన లోకేశ్‌కు పాదయాత్రలో అపశ్రుతి పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లారు. వెంటనే అతడిని స్థానిక కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చేయించారు. పరిస్థితి మెరుగు పడకపోవడంతో పీఈఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో క్యాడర్లో టెన్షన్ మొదలైంది. చికిత్స కొనసాగుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగు పడడం లేదు. వైద్యానికి స్పందించడం లేదు. వైద్యులు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. సమస్య ఏమిటన్న విషయం చెప్పడం లేదు. తారకరత్న పల్స్ తక్కువగా ఉందని, ఆయనకు సీపీఆర్ చేశామని కేసీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కేడర్ మాత్రం తారకరత్న క్షేమంగా రావాలని, మళ్లీ పాదయాత్రలో లోకేష్‌తో కలిసి నడవాలని కోరుకుంటోంది.