
Nara Lokesh Padayatra: అప్పుడు అధికార పార్టీ చేసిన తప్పే.. ఇప్పుడున్న అధికార పార్టీ చేస్తోంది. అప్పుడు వారు ఫోకస్ చేసిన అంశమే ఇప్పుడు వీరు కూడా ఫోకస్ చేస్తున్నారు. వారి బాటలోనే వీరు కూడా నడుస్తున్నారు. గతం తాలుకూ ఫలితాలను మర్చిపోయారు. కార్డ్ సేమ్.. నేమ్ డిఫరెంట్ అని ఆర్జీవీ మనీ సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ లాగ. అప్పటి ఫలితమే ఇప్పుడూ వస్తుందా ? అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా ? అన్న చర్చ ఏపీ మొత్తం జరుగుతోంది.
అది 2019 ఎన్నికల ముందు చిత్రం. జగన్ పాదయాత్ర మొదలుపెట్టాడు. జగన్ తో పాటు జనం కదిలివస్తున్నారు. జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ జనంతో మమేకం అవుతున్నారు. పిల్లాపాప, ముసలిముతకను ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నాడు. నుదిటి పై ముద్దులు పెడుతూ ఓదార్చుతున్నాడు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ టీడీపీ వీటిని చూసిచూడనట్టు వదిలేసింది. జగన్ ముద్దులు పెట్టడం పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేసింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
జగన్ ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. జగన్ పాదయాత్ర సమయంలో టీడీపీ జగన్ ను హేళన చేయడానికి, పాదయాత్ర ప్రభావాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించింది. తన శక్తియుక్తులన్నీ అందుకే ఖర్చుపెట్టిందని చెప్పవచ్చు. కానీ జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ప్రజలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేశారు. చివరికి విజయం సాధించారు. టీడీపీ చేసిన ప్రయత్నాలు తేలిపోయాయి. 23 సీట్లతో మొహం వాచిపోయింది.

2019 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన పనినే ఇప్పుడు వైసీపీ చేస్తోంది. నారాలోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో లోకేష్ కొంచెం వీక్ అనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు పదాలను సరిగా ఉచ్చరించలేరు. దీంతో అక్కడక్క తప్పులు దొర్లుతాయి. వీటినే వైసీపీ ఫోకస్ చేస్తోంది. వీటిని కట్ చేసి సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేస్తోంది. లోకేష్ అసమర్థుడని చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ టీడీపీ వీటిని వదలేసింది. నారాలోకేష్ ఆహార్యం, బాష పై పట్టుసాధించేలా ఫోకస్ చేసింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే లోకేష్ నడక, బాషలో కొంత మార్పు వచ్చింది. ప్రజల్లో కూడా మంచి స్పందనే వస్తోంది. పాదయాత్ర లక్ష్యం ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం. వారి బాధలు, కష్టాలు వినడం. వారితో ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం. అంతే కానీ చిన్న చిన్న పొరపాట్లు, పదదోషాలు, ఉచ్చారణ లోపాలు కాదు. లోకేష్ ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం పైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రత్యర్థుల మాటలకు కుంగిపోవడం లేదు. స్పోర్టివ్ గా తీసుకుంటున్నారని చెప్పవచ్చు. గతంలో టీడీపీ చేసిన పనినే వైసీపీ చేస్తుందని చెప్పవచ్చు. వైసీపీలో మార్పు రాకపోతే అప్పటి ఫలితమే పునరావృతం అవుతుందని చెప్పవచ్చు.