Lionel Messi: నేరేడు రంగు కళ్ళు. తెలుపు రంగు ఒళ్ళు. మైదానంలో చిరుతలా పరిగెత్తుతాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వడు.. బంతిపై పూర్తి నియంత్రణ సాధిస్తాడు. ఆట మొదలైంది మొదలు చివరిదాకా పోరాడుతాడు. సమకాలీన ఫుట్ బాల్ చరిత్రలో అతడు ఒక దిగ్గజం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మారడోనా సారథ్యం వహించిన అర్జెంటీనా జట్టుకు…ఇప్పుడు అతడే కర్త, కర్మ, క్రియ. ప్రస్తుత ఫిఫా కప్ లో జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. 36 ఏళ్ల జట్టు కలను, 16 ఏళ్ల తన కలను నెరవేర్చుకోవాలి అనే తీరుగా ఆడుతున్నాడు. అంతే కాదు తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్నాడు. దీని తర్వాత అతడు తన కెరీర్ కు ముగింపు పలకబోతున్నాడు.

-అర్జెంటినా ఆణిముత్యం
1987 జూన్ 24న జన్మించిన మెస్సి ఫుట్ బాల్ క్రీడాకారుడు కావడమే ఒక సంచలనం. మొదట్లో అతడు అనేక క్లబ్ లకు ఆడాడు. 2003లో జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. యూఈఎఫ్ఏ సహా 34 ట్రోఫీలను అర్జెంటీనా వశం అయ్యేలా చేశాడు. 22 సంవత్సరాల వయసులో తన మొదటి “బాలన్ డీఓర్” పురస్కారం గెలుచుకున్నాడు. ఇలా వరుసగా నాలుగు సార్లు గెలుచుకున్నాడు.. ఈ రికార్డు సాధించిన మొదటి ఆటగాడు తనే. 2011_12 సీజన్లో బార్సిలోనా క్లబ్ లో ఆల్ టైం టాప్ గోల్ స్కోరర్ గా నిలిచాడు. యూరోపియన్ రికార్డులను కూడా నెలకొల్పాడు. తర్వాతి రెండు సీజన్లలో, 2014-15 క్రిస్టియానో రొనాల్డో తర్వాత నిలిచాడు.
-అతడు ఆడుతుంటే..
మారడోనా తర్వాత అత్యధిక అభిమానులను సాధించుకున్న అర్జెంటీనా క్రీడాకారుడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. అంతేకాదు తన ఆట తీరుతో అర్జెంటీనా జట్టుని 2014లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు.. కానీ దురదృష్టవశాత్తు ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఓడిపోయింది. ప్రస్తుత ప్రపంచకప్ లో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. అంతేకాదు తన జట్టుని ఫైనల్ కి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.. ఈ ఫుట్ బాల్ కప్ లో ఆయన ఐదు గోల్స్ సాధించాడు.. గోల్డెన్ బూట్ రేస్ లో ఉన్నాడు.. అతడితోపాటు ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ మబప్పే ఐదు గోల్స్ సాధించి మెస్సి సరసన ఉన్నాడు. మరోవైపు ఫైనల్ ముగిసే సమయానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు అత్యధిక గోల్స్ తో సమంగా నిలిస్తే దాన్ని గోల్డెన్ బూట్ టై బ్రేకర్స్ అంటారు. ఈ సమయంలో ఎవరైతే అత్యధిక అసిస్ట్ లు, తక్కువ నిమిషాలు ఆడి ఉంటారో వారిని విజేతగా నిర్ణయిస్తారు.. గోల్ చేసే స్కోరర్ కు బంతిని పాస్ చేయడం లేదా క్రాస్ చేయడం చేస్తే ఆటగాడి ఖాతాలో అసిస్ట్ చేరుతుంది. ఈ ప్రకారం మూడు అసిస్ట్ లతో మెస్సి ముందంజలో ఉన్నాడు. మబప్పే రెండు అసిస్ట్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నిమిషాల ప్రకారం అయితే మబప్పే (477 ) కంటే మెస్సీ (570) ముందు ఉన్నాడు.

ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా గెలిస్తే 36 ఏళ్ల సుదీర్ఘ విరామానికి శుభం కార్డు పడుతుంది. అదే సమయంలో మెస్సి ఒకటి లేదా రెండు గోల్స్ సాధిస్తే గోల్డెన్ బూట్ అవార్డు లభిస్తుంది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకుగాను గోల్డెన్ బాల్ పురస్కారం కూడా అందుతుంది.. అంటే మెస్సి తన అంతర్జాతీయ ఫుట్ బాల్ కు సంబంధించి చివరి మ్యాచ్ ఆడుతున్నాడు కనుక గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్, ఫిఫా కప్ అందుకుంటాడు.. ఇది సాధించిన క్రీడాకారుడుగా రికార్డు నెలకొల్పుతాడు. అదే సమయంలో ఫ్రాన్స్ గెలిస్తే వరుసగా రెండు ప్రపంచ కప్ లు గెలిచిన ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది..