RRR Mania: ఆర్ఆర్ఆర్ మేనియా పతాక స్థాయికి చేరుతోంది. బాహుబలి తీసిన రాజమౌళి పై నమ్మకంతో అందరూ ఈ మూవీ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టికెట్ల గోల వినపడుతోంది. సాధారణ ప్రేక్షకులు, ప్రజలు, సెలబ్రెటీలు, జనం అంతా ఈ టికెట్లు కావాలని ఆరాటపడుతున్నారు.
ఈ క్రమంలోనే రాంచరణ్, తారక్ ఫ్యాన్స్ , అభిమాన సంఘాలు స్పెషల్ షోల కోసం డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి థియేటర్లను బుక్ చేసుకుంటున్నాయి. ఇక ఫ్యాన్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ముందస్తుగా ప్రత్యేక షోలను వేస్తున్నారు. ఆ టికెట్లను అమ్మి ఫ్యాన్స్, తెలిసిన వారికి పంచిపెట్టుకుంటున్నారు. అందరూ ఎంత రేట్ అయినా సరే తొలి షో చూడడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ప్రత్యేక షోలకు డిమాండ్ నెలకొంది. ఫ్యాన్స్ సంఘాలు దగ్గరుండి మరీ ఈ షోలు వేస్తున్నారు.
ఇక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తమ కుటుంబ సభ్యులకు, పార్టీ అనుచరులు, నేతలు, కార్యకర్తల కోసం పెద్దఎత్తున బల్క్ గా టికెట్లు కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టికెట్ లకు డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. దీంతో చాలా మంది తమ పలుకుబడిని, ఫైరవీలను ఉపయోగించుకొని ఆర్ఆర్ఆర్ టికెట్లను దొరకబుచ్చుకుంటున్నారు. డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో ఎంత రేటు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కొందరు నేతలు ఉన్నతాధికారుల సాయం కూడా తీసుకుంటున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, నేతలు ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అధికారంలో ఉన్న వీరు టిక్కెట్లు ఇవ్వాలని థియేటర్ యజమానులు, అభిమాన సంఘాలను అభ్యర్థిస్తున్నారు. కొందరు చోటా మోటా నేతలు ఇలా తీసుకొని బ్లాక్ టికెట్ల రూపంలో కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ మేనియా ఎంతలా ఉందంటే.. తొలి షోను హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో రూ.5వేల చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిసింది. అంత రేటు టాలీవుడ్ చరిత్రలోనే అత్యధికం. ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమా టికెట్ ను ఇంతపెట్టి కొనలేదు. చూడలేదు. అలా ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది.