
దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు పలు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తారాఖాండ్ రాష్ట్రాన్ని వర్షం గజగజా వణికించింది. పిథోర జిల్లాలోని కైలాష్-మానససరోవర్ యాత్రా మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోగా విరిగిపడ్డ కొండ చరియల వల్ల ఈ మార్గం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సైతం కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగి పడటంతో జాతీయ రహదారి 309 ఏపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని చాలా ఇళ్లు ప్రమాదంలో పడ్డాయి. లోతట్టు పాంతాలలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి.
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించింది. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షాల వల్ల థంస్సా నది నీరు పేరుప్రఖ్యాతలు గాంచిన తపకేశ్వర స్వామి గుడిని తాకింది. వరదల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇల్లు, రోడ్లు కొట్టుకుని పోయాయి. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ భారీ నష్టం వాటిల్లిన పితోర్ ఘర్ జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.