Simhasanam Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. విభిన్న చిత్రాలను తీయడంతో పాటూ కలర్ సినిమాలను పరిచయం చేసింది కృష్ణనే అని చెప్పుకుంటారు. అంతేకాకుండా సాహసం సినిమాలు తీసి అందరి మెప్పు పొందాడన్నపేరుంది. ఈ క్రమంలో మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం సినిమాలు ఆయన కెరీర్లోనే బెస్ట్ మూవీస్ అని చెప్పవచ్చు. వీటిలో సింహాసనం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా నిర్మాణం సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ కాలంలో రూ.50 లక్షలతో సినిమా తీయడమంటేనే సాహసం. అలాంటిది కృష్ణ రూ.3.50 కోట్లు పెట్టి దీనిని స్వయంగా ఆయనే నిర్మించి డైరెక్షన్ చేశారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు.
1980 దశకంలో సూపర్ స్టార్ కృష్ణకు జానపద చిత్రం తీయాలనే కోరిక ఉండేంది. అలా ఆయన మదిలో నుంచి వచ్చినదే సింహాసనం. ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించగా జయప్రద, రాధతో పాటు బాలీవుడ్ హీరోయిన్ మందాకిని కూడా నటించారు. పూర్తిగా జానపదంగా తెరకెక్కిన ఈ చిత్రం తీసే సమయంలో సినిమా గురించి ప్రతిరోజూ వార్త పత్రికలో న్యూస్ వచ్చేది. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. అలాగే దీనిని కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేసి 1986 మార్చి 21న రిలీజ్ చేశారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ దీనిని నిర్మించారు. హిందీలో జితేంద్ర హీరోగా నటించారు.
ఇక ఈసమయంలో ఒక సినిమా తీయాలంటే రూ.50 లక్షల పెట్టుబడి అవసరం. అయితే ఈ సినిమాకు రూ.3.50 కోట్లు నిర్ణయించారు. ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఇతర నిర్మాతలకు ఇచ్చి.. ఆ తరువాత నష్టపోతే ఎలా అని కృష్ణ ఆలోచించి తానే స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ఆ కాలంలో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడమంటే కత్తిమీద సామే. కానీ కృష్ణ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
అయితే సినిమా విడుదలయిన తరువాత కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్ రూ.1.51 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒకే థియేటర్లో రూ.15 లక్షలు వసూలు చేసింది. వైజాగ్ లో 100 రోజులు నడిచింది. ఇలా మొత్తంగా రూ.7 కోట్లు వసూలు చేసింది. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫంక్షన్ ను చెన్నైలో నిర్వహించారు. ఇందులో కోసం అభిమానులు 400 బస్సుల్లో అక్కడికి వచ్చారని అంటుంటారు.