
Kotamreddy Sridhar Reddy: ఇన్నాళ్లు ఒకరికొకరు సహకరించుకున్నారు. నీకిది.. నాకది అంటూ సహాయం చేసుకున్నారు. కానీ పైకి మాత్రం ఉప్పు నిప్పులా ఉన్నట్టు నటించారు. విమర్శలు గుప్పించుకున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సామెత నిజమైంది. ఆ రెండు పార్టీలకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ రెండు పార్టీలకు అగ్నిపరీక్ష ఎదురైంది. సచ్చీలతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఒకరికొకరు సహకరించుకుంటారా ? దోషుల్ని చట్టం ముందు నిలబెడతారా ? అన్న ప్రశ్నలు పురుడుపోసుకుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీతో మైత్రీ బంధం కొనసాగిస్తోంది. పార్లమెంట్లో బీజేపీకి అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తోంది. రాష్ట్రంలో తమకు కావాల్సిన పనులు చేయించుకుంటూ వైసీపీ కాలం గడుపుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే వైసీపీ, బీజేపీ మైత్రికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. సీబీఐ కేసుల విచారణ, అవి ముగియక ముందే వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. ఇవన్నీ కలసి వైసీపీని బీజేపీ ముందు మోకరిల్లేలా చేశాయని చెప్పవచ్చు. డూడూ బసవన్నలా తలూపడం తప్ప మరో గత్యంతరం లేని స్థితి కలిగిందని అనుకోవచ్చు. బీజేపీ చెప్పినట్టల్లా తలాడిస్తూ.. సీబీఐ కేసులు మెడకు చుట్టుకోకుండా వైసీపీ ఇన్నాళ్లు గట్టెక్కుతూ వచ్చింది.
సీబీఐ కేసులు, వైఎస్ వివేకా హత్య కేసుల్లో బీజేపీ నుంచి జగన్ వీలైనంత సహాయం పొందారని చెప్పవచ్చు. బీజేపీ సాయానికి ఉడతాభక్తిగా కేంద్రంలో అవసరం మేరకు మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మిన్నుకుండిపోయారని చెప్పవచ్చు. ఇక తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనలో ఉన్న వైసీపీ.. విశాఖకు రాజధాని తరలిస్తున్నట్టు ప్రకటించింది. ఇంతలోనే బీజేపీ వైసీపీ నెత్తిన రాయి వేసిందని చెప్పవచ్చు. పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో రాజధాని అమరావతికి మద్దతుగా ప్రకటన చేసింది. దీంతో వైసీపీకి నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్టయింది. అంతా బాగుందనుకున్న సమయంలో ఇలా జరగడం వైసీపీకి మింగుడు పడటంలేదు.

రాజధాని ఎపిసోడ్ ముగియకముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని కోటంరెడ్డి ఆరోపించారు. అంతటితో ఆగకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై విచారణ జరిపించాలని కోరారు. దీంతో వైసీపీకి మరో తలనొప్పి మొదలైంది. ఇన్నాళ్లు అనుకూలంగా ఉన్న బీజేపీ.. అమరావతి విషయంలో షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం చేస్తుందోనన్న ఆందోళన వైసీపీలో మొదలైంది.
వైసీపీ, బీజేపీ మైత్రీ బంధానికి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురైందని చెప్పవచ్చు. అమరావతి విషయంలో బీజేపీ వ్యవహరించినట్టుగానే.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా ? అన్న ప్రశ్న తలెత్తింది. అమరావతికి అనుకూలంగా నిర్ణయం ప్రకటించడం జగన్ దూకుడుకు కళ్లెం వేయడానికేనా అన్న అనుమానం కలుగుతోంది. లేదంటే బీజేపీకి నిజంగా అమరావతి పై చిత్తశుద్ధి ఉందా అన్నది తెలియదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం పై బీజేపీ, వైసీపీ మైత్రి ఆధారపడి ఉందనేది నిర్వివాదాంశం. చిరకాల మిత్రడికి అండగా నిలబడుతుందా ? లేదా బాధితుడి వైపు నిలబడుతుందా ? అన్నది వేచిచూడాలి.
