Kolkata Doctor Case: కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి ఉదంతం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దారుణంపై గళం తిప్పుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో ప్రస్తుతం టీమిండియా ఒకప్పటి స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా చేరిపోయారు. ఆయన తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో.. వైద్యురాలి హత్యాచార ఉదంతాన్ని ప్రస్తావించారు. విచారణ వేగవంతం కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీగా హర్భజన్ సింగ్ కొనసాగుతున్నారు. విచారణను వేగవంతం చేయాలని ఒక లేఖ కూడా రాశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు. హర్భజన్ రాసిన లేఖ నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వైద్యురాలి పై దారుణానికి పాల్పడిన నిందితుడికి త్వరగా శిక్ష పడాలని హర్భజన్ సింగ్ ఒక లేఖలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విన్నవించారు. ఇందులో బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ పేరును కూడా ప్రస్తావించారు. ” ఇది దారుణమైన సంఘటన. సభ్య సమాజం తల దించుకునే సంఘటన. ఒక వైద్యురాలు అలా ప్రాణాలు కోల్పోవడం దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. ఈ దారుణం సమాజంలో పేరుకుపోయిన పురుష అహంకారాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. వ్యవస్థలో కచ్చితంగా మార్పు రావాలి. అధికారులు తమ తక్షణ బాధ్యతగా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలను రక్షించే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు. ఇంతటి ఘోరం మరోసారి చోటు చేసుకోకూడదు. ఇంతటి బాధను మృతురాలి తల్లిదండ్రులు ఎలా భరిస్తున్నారో? వారిని తలుచుకుంటేనే గుండె ముక్కలవుతోందని” హర్భజన్ ఆ లేఖలో రాశారు.
హర్భజన్ రాసిన లేఖ ఆదివారం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే నెటిజన్లు మమత ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ” హర్భజన్ భాయ్ మీరు లేఖ రాశారు. బాగుంది. ఒక సెలబ్రిటీగా మీ స్పందన తెలియజేశారు. కాకపోతే మమతా బెనర్జీ చర్యలు తీసుకోలేరు. ఆమె వన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు. చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. న్యాయం చేయాలని అడుగుతూ రోడ్డెక్కిన సామాన్యులను అరెస్టు చేయిస్తున్నారు. మీ లేఖకు గవర్నర్ స్పందించారు. ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందనలేదు. బాధ్యతగల సెలబ్రిటీగా మీరు స్పందించారు. మీ బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నం మిగతా సెలబ్రిటీలు కూడా చేయాలి. అప్పుడే సమస్య తీవ్రత పరిపాలిస్తున్న పాలకులకు అడ్డం పడుతుందని” నెటిజన్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.