
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ వింతగా ఉంటాయి. కిమ్ తీసుకునే నిర్ణయాలపై అక్కడి ప్రజల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఉత్తర కొరియా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గత కొన్ని నెలల నుంచి ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రజలు చెల్లించే పన్నులను ఆయుధాలు కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఖర్చు పెట్టింది.
ఫలితంగా ఉత్తర కొరియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలు దెబ్బతిన్నాయి. తీవ్ర ఆహార కొరత ఏర్పడటంతో ఆకలితో ప్రజలు విలవిలలాడుతున్నారు. 25.5 మిలియన్ల మంది ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోళ్లు, మేకలు, పందుల కొరత ఏర్పడటంతో అక్కడి ప్రజలు చివరకు మాంసం కోసం వీధి కుక్కలపై పడ్డారు. వీధి కుక్కల మాంసాన్ని తింటూ జీవనం సాగిస్తున్నారు.
కుక్కలను తినే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరగడంతో ప్రసుతం కుక్కలకు సైతం కొరత ఏర్పడింది. ఈ విషయం తెలిసిన కిమ్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు పెంచుకునే కుక్కలను కూడా మాంసం కోసం వినియోగించుకొనేలా ఆదేశించారు. ప్రభుత్వం అక్కడి ప్రజలు ఇష్టంతో పెంచుకునే కుక్కలను స్వాధీనం చేసుకుంటోంది. ఆ కుక్కలను ఆహారంగా వినియోగించుకోవాలని కిమ్ నిర్ణయం తీసుకోగా అక్కడి ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.