KCR Jagtial Tour: ‘నేను మాట ఇస్తే తప్పను.. కేసీఆర్ చెప్పిండంటే చేస్తడు.. అవసరమైతే తల నరుక్కుంటా కానీ.. మాట తప్పను.. కుర్చీ ఏసుకొని కూసుండి పని చేయిస్తా.. గదెంత పని.. చిన్న ముచ్చట..’ ఇలా ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగం. ఎక్కడ బహిరంగ సభ పెట్టినా.. అక్కడి ప్రజలకు స్థానిక సమస్యల పరిష్కారాన్ని అరచేతిలో చూపిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండడం, ముందస్తుకు వెళ్తారన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. మొన్న పాలమూరు జిల్లాకు వెళ్లి.. అక్కడి ప్రాజెక్టులు, సాగునీరు అందిస్తున్న తీరు. తెలంగాణను అభివృద్ధి చేసిన విధానంపై ప్రసంగించారు. తాజాగా జగిత్యాల జిల్లా పర్యటనకు బుధవారం వచ్చారు కేసీఆర్. జిల్లాపై వరాల వర్షం కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలని అన్నారు.

పాత హామీల ఊసెత్తని కేసీఆర్..
జగిత్యాల సభ వేదికగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ 2019 సెప్టెంబర్ 11న జగిరిన బస్సు ప్రమాద బాధితుల ఊసెత్తలేదు. ఈ ప్రమాదంలో 65 మంది మృతిచెందారు. 50 మంది గాయపడ్డారు. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదంగా దీనిని గుర్తించారు. నాటి ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు కానీ, బాధితులను ఓదార్చేందుకు కానీ కేసీఆర్ రాలేదు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. దీంతో కేసీఆర్ బాధితులను ఆదుకుంటామని ప్రపకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. క్షతగాత్రులు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
రెండు రోజుల క్రితం బాధితుల ఆందోళన
సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేసీఆర్ కొడిమ్యాలకు వచ్చి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి అంగవైకల్యం పాలైన చాలామందికి కనీసం పెన్షన్ కూడా రావడం లేదన్నారు. బస్సు ప్రమాదంలో తల్లితండ్రిని కోల్పోయి అనాథగా మారానని.. ఎమ్మెస్సీ చదివిన తనకు ఆర్టీసీలో ఉద్యోగమిచ్చి ఆదువుకోవాలని ఓ బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. తమకు దళితబంధులో ప్రాధాన్యమివ్వాలని కోరారు. కనీసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలైన ఇవ్వాలని వేడుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం బాధితులపై దయ కలుగకపోవడం గమనార్హం.
వేములవాడ అభివృద్ధి ఏమైనట్టు?
యాదాత్రి తరహాలో దక్షిణ కాశీగా పేరున్న వేములవాడను అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం ఏటా రూ.100 కోట్లు విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ ఐదేళ్ల క్రితం ప్రకటించారు. ఒక ఏడాది మాత్రం రూ.100 కేటాయించారు. తర్వాత ఆ హామీని అటకెక్కించారు. ఆలయ అభివృద్ధి కోసం స్థలం సేకరించినప్పటికీ అభివృద్ధి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం రోడ్ల విస్తరణ కూడా చేయలేదు. మరోవైపు మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. దీని పునర్నిర్మాణం జరుగడం లేదు.

కాగితాల్లోనే ధర్మపురి మాస్టర్ ప్లాన్
‘ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమానిత్వమైన, అద్భుతమైన నరసింహస్వామి ధర్మపురికి వచ్చాను. ఆరోజు ఒక మాట చెప్పాను. గోదావరి నది నాటి ఏపీలో తెలంగాణలో మొదట ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరని సింహంలా గర్జించాను’ అని అన్నారు కేసీఆర్. కానీ ధర్మపురి ఆలయ అభివృద్ధి గురించి నోరు మెదపలేదు. రూ.120 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నాలుగేళ్ల క్రితం ప్రకటించారు. మొదటి విడతగా రూ.60 కోట్లు విడుదల చేశామన్నారు. కానీ ఇప్పటికీ ఆలయంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టేలేదు.
కొండగట్టు ఆ జాబితాలోకే చేరుతుందా..
కొండగట్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధర్మపురి, వేములవాడ నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల జాబితాలో కొండగట్టు అంజన్న ఆలయం కూడా చేరుతుందని పేర్కొంటున్నారు. కేసీఆర్ మాటల్లోనే అభివృద్ధి చూపుతారని, క్షేత్రస్థాయిలో ఏమీ ఉండదని విమర్శిస్తున్నారు. ఇందుకే ఐదేళ్ల క్రితం వేములవాడకు, నాలుగేళ్ల క్రితం ధర్మపురికి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు చెబుతున్నట్లు కొండగట్టు అభివృద్ధి కూడా వేములవాడ, ధర్మపురి అభివృద్ధిలాగానే కాగితాలకే పరిమితమౌతుందా లేక క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేస్తారో వేచి చూడాలి.