
KCR Govt On Temples: ఈ దేశంలో మెజారిటీ ఓటు బ్యాంకు హిందువులదే. వారి మనసు చూరగొన్న పార్టీ బిజెపి. అందుకే అది వరుస విజయాలు సాధిస్తోంది.. గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నది కాబట్టే అప్రతిహతంగా గెలుచుకుంటూ వస్తోంది. ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ దేశంలోని పలు దేవాలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.. ఇప్పుడు అదే ఆయనను కొండంత స్థానంలో నిలబెట్టింది. చివరికి అయోధ్య వివాదానికి చరమగీతం పాడి, అక్కడ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు . ఇది ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది. భారతీయ జనతా పార్టీని రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే విధానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవలంబిస్తున్నారు.. ఓటు బ్యాంకు రాజకీయాలపై బాగా పట్టు ఉన్న కేసీఆర్.. హిందుత్వ ను మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కాకుంటే అది ఆయన స్టైల్లో.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ప్రభుత్వంపై ఉద్యమాలను తీవ్రతరం చేస్తోంది. తనకు ఆయువు పట్టయిన హిందుత్వను ప్రచారం చేసుకుంటున్నది. ఇక్కడే కెసిఆర్ బిజెపిని తెలివిగా దెబ్బ కొడుతున్నాడు. హిందుత్వం అంటే మత పిచ్చి లేపడం కాదని, దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడం అని నిరూపిస్తున్నాడు. దీనివల్ల బిజెపి అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో విస్తరించలేకపోతోంది. పైగా కేసీఆర్ వీలు చిక్కినప్పుడల్లా ఆలయాలకు వెళ్తుంటారు. యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో గతంలో పలుమార్లు ఆయన రాజ శ్యామల యాగాలు చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట రూపురేఖలు మార్చారు. అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఫలితంగా నేడు యాదాద్రికి రోజుకు 50 వేల మంది భక్తులు వస్తున్నారు. ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటున్నది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో టెంపుల్ టూరిజం డెవలప్ అవుతున్నది.
యాదగిరిగుట్ట మాదిరే కొండగట్టు, వేములవాడ, భద్రాచలం, రామప్ప, వేయి స్తంభాల గుడి, ధర్మపురి, కాలేశ్వరం, బాసర వంటి ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కేసీఆర్.. ఆలయ అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. కెసిఆర్ చెప్పినట్టు ఇప్పట్లో ఈ ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవచ్చు. ఎందుకంటే మరి కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటి అంశం ఆధారంగా కెసిఆర్ రేపు ప్రజలను ఓట్లు అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఆలయాల అభివృద్ధి బాధ్యత తీసుకున్న ప్రభుత్వం..5,050 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నది. భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ దేవాలయాలకు క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. పూజలు, అర్చనలు, ఇతరత్రా సేవలకు ముందుగా బుకింగ్ చేసుకునే వెసలు బాటు కూడా కల్పించింది. ఇక ఆలయ అభివృద్ధి కమిటీలతో సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి పనులు చేస్తోంది. దీనికి అవసరమైన నిధులను దేవాదాయశాఖ ఆమోదిస్తోంది. మొత్తంగా ఈ హిందూత్వ విధానంతో బిజెపిని తెలంగాణలో ఏదైనా కేసిఆర్ చేస్తున్నారు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు. కెసిఆర్ ప్లాన్ మామూలుగా లేదు.