
Kanna Lakshminarayana: టీడీపీలో చేరిన కన్నాకు అంత సీన్ లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గొంతు చించుకొని అరుస్తున్నారు. కన్నా రాక ఒక్క చంద్రబాబుకు తప్ప ఎవరికి మోదం కాదని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు కన్నా పార్టీలో చేరిన మొదటి రోజే టీడీపీని ఇరుకున పెట్టేశారు. టీడీపీకి భవిష్యత్ లేదని తేల్చేశారు. పవన్ తో కలిస్తేనే భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిస్తేనే రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడగలమని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేనతో పొత్తు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగలదని కన్నా చెప్పడంతో టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. అందరం జనసేనతో పొత్తు కోరుకుంటున్నామని.. కానీ కన్నా ఏకంగా పొత్తు లేకపోతే టీడీపీకి భవిష్యత్ లేదని తేల్చేయ్యడం ఏమిటని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్, అందునా సుదీర్ఘ కాలం మంత్రిగా పట్టున్న నాయకుడు కావడంతో మందీ మార్భలంతో వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తనను తాను ప్రజాప్రతినిధిగా చూసుకొని చాలా కాలమైంది. అందుకే ఈసారి ప్రజాప్రతినిధి కావాలంటే ప్రధాన పార్టీలో చేరాలని తలపోశారు. టీడీపీలో కన్నా చేరారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఏ అవకాశం వదలకూడదు. అందుకే కన్నా లాంటి వారిని చేర్చుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. ఎవరి అవసరం వారిది కనుక.. లాభ నష్టాలను భేరీజు వేసుకుంటారు. అయితే ఇలా కన్నా పార్టీలో చేరారో లేదో.. టీడీపీ అనుకూల మీడియా నుంచి కన్నాకు ఆహ్వానం అందింది. డిన్నర్ చేసి డిబేట్ లో పాల్గొన్న కన్నా తన మనసులో ఉన్న మాటలను వ్యక్తపరిచారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధానంగా టీడీపీ, జనసేన పొత్తు అంశాలనే కన్నా మాట్లాడారు. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పవన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కీలకమని చెప్పారు. పొత్తు లేకుంటే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందన్నట్టు మాట్లాడారు. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. టీడీపీలో చేరిన పవన్ నామస్మరణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ ఒంటరిగా వెళితే అధికారంలోకి రాదన్నట్టు కన్నా మాట్లాడారు. ఇవి కేడర్ లోకి నెగిటివ్ భావన తీసుకెళతాయని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే పవన్ పై కులపరమైన ప్రేమో.. లేకంటే కాపుల ఓట్లు గురించి తెలియదు కానీ.. కన్నా వ్యాఖ్యలు టీడీపీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారు.