KA Paul- Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకాన్ని విషాదం లోకి నెట్టింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నానక్ రామ్ గూడలో ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు తో సహా దాదాపు సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి కృష్ణకు నివాళులర్పించింది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వచ్చి కృష్ణ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం కృష్ణ నివాసానికి వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనకు కృష్ణతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. కృష్ణకు ఓ చివరి కోరిక ఉందని చెప్పడం ఆసక్తిగా మారింది.

ఈమధ్య కేఏ పాల్ ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. ఆయన ఏం మాట్లాడినా అవి వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణించారన్న విషయం విని తట్టుకోలేక పోయాను అని కేఏ పాల్ ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ గారితో తనకున్న పరిచయం గొప్పదని అన్నారు. 26 సంవత్సరాల కిందట కృష్ణ తన శాంతి సభకు వచ్చారన్నారు. అప్పుడే ‘సర్.. మీ సందేశాలను సినిమాగా చేద్దామని అనుకుంటున్నా..’ అని కృష్ణ చెప్పారన్నారు. అందులో భాగంగానే ‘శాంతి సందేశం’ అనే సినిమా వచ్చిందన్నారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నారు. కానీ శాంతిని కోరే నటుడు కృష్ణ మాత్రమే అన్నారు. ఫిజికల్ గా కృష్ణ మనమధ్య లేకపోవచ్చు గాని కానీ ఆయన గుర్తులు మన మధ్యే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ కృష్ణ గురించి మాట్లాడుతూ మహేశ్ ను కలిశారు. ఆ తరువాత ఆయనను ఓదార్చారు. ఇక కేఏ పాల్ కృష్ణ నివాసం వద్దకు రాగానే సందడిగా నెలకొంది. ఆయన ఏం మాట్లాడుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇదిలా ఉండగా కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇప్పటికే తెలుగు నటులంతా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. ఇక దేశ, విదేశాల్లోని అభిమానులు కృష్ణ ను చివరి సారిగా చూసేందుకు తరలి వస్తున్నారు. లెజెండ్ యాక్టర్ మృతికి సంతాపంగా నేడు షూటింగ్ లకు విరామం ఇచ్చినట్లు ప్రకటించారు. అటు అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.