
Jagan- AP Employees: దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి న్యాయబద్ధంగా చేస్తున్న చెల్లింపులు లేవు. గత ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు లేవు. చివరకు పీఆర్పీలో కోత విధించారు. గత కొన్నేళ్లుగా లెక్కకట్టి కోత విధించి వెనక్కి ఇచ్చేయ్యాలని ఆదేశాలిచ్చారు. అటు సీపీఎస్ పై కూడ మడమ తిప్పేశారు. అప్పుడెప్పుడో అవగాహన లేకుండా హామీ ఇచ్చానని.. అమలుచేయడం చాలా కష్టంగా తేల్చేశారు. దాని బదులుగా వేరే ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే కొత్త పరీక్ష పెట్టారు. వారు ఆశిస్తున్న ప్రయోజనాలను కట్టడి చేసేందుకు జీతాలు ఆలస్యం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మూడో వారం దాటిన తరువాత జీతాలు చెల్లిస్తుండడంతో పాత డిమాండ్లను ఉద్యోగులు మరచిపోతున్నారు. ఒకటో తేదీ జీతం ఇస్తే చాలు అన్నట్టు ఒక మెట్టుకు దిగిపోతున్నారు.
పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిలీనియం మార్చ్ నిర్వహించిన ఉద్యోగులు ప్రభుత్వాన్ని గట్టి అల్టిమేట్ ఇచ్చారు. అప్పటి నుంచే ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ప్రారంభమయ్యాయి. అయితే తరువాత ఉద్యోగ సంఘాల నేతలను గుప్పెట్లో పెట్టుకున్న ప్రభుత్వం మరోసారి ఆ తరహ ఉద్యమం రాకుండా జాగ్రత్తపడింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉద్యోగ సంఘాల నేతలతో పని లేకుండా ఉద్యోగులు దూకుడు పెంచారు. మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది.
తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘ నేతలతో కీలక చర్చలు జరిపింది. ముఖ్యంగా వేతన బకాయిల చెల్లింపు పైన హామీ ఇచ్చింది. అందులో భాగంగా రూ 3 వేల కోట్లు ఈ నెలలోనే చెల్లించనున్నట్లు స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులకు సంబంధించి డీఏ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు సమయంలో కూడిన స్పష్టత లభించింది. సెప్టెంబర్ లోగా రెండు విడతలుగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. చర్చలు సానుకూలంగా జరిగినందుకు ఉద్యమ కార్యాచరణ నిలిపివేయాలని మంత్రి వర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలను కోరింది. చర్చల్లో తీసుకున్న నిర్ణయాల పై మినిట్స్ అందించాలని..సంఘాలతో చర్చించి నిర్ణయ తీసుకుంటామని సంఘాల నేతలు చెప్పారు.

గత ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతుతో అంతులేని విజయం సాధించిన తరువాత జగన్ స్వరం మారింది. స్వాంతన చేకూర్చలేదు కదా. వారికి ప్రతిబంధకమైన నిర్ణయాలు తీసుకొని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారికి అంత మొత్తంలో జీతాలు ఎందుకు అనుకుందో ఏమో తెలియదు కానీ.. ఒకటో తేదీన జీతం అన్నమాట మరిచిపోయేలా చేస్తోంది. మూడో వారం దాటే వరకూ జీతాలు చెల్లిస్తూనే ఉంది. గత కొద్దినెలలుగా ఇదే జరిగింది. వేతన జీవులు గుర్తించుకునేది ఒకటో తారీఖు. అదే తేదీన బ్యాంక్ ఖాతాల్లో జీతాలు జమ అవుతాయి. పాలవాడి నుంచి పేపరు బిల్లుల దాకా.. రేషన్ షాపు నుంచి పిల్లల ఫీజుల వరకూ అదే తేదీన చెల్లింపులు చేస్తారు. ఆర్థికపరమైన అన్ని అంశాలు అదే తేదీ చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే ఉద్యోగులు ‘అమ్మో ఒకటో తారీఖు’ అని సంబోధిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యం కలిగిన ఒకటో తారీఖు చరిత్రను జగన్ సర్కారు చెరిపేసింది. ఆ తేదీన చెల్లించాల్సిన జీతాలను నెలలో మూడో వారంలో చెల్లిస్తోంది. పింఛనుదారులకు చుక్కలు చూపిస్తోంది.