
Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండే వారిని కలిసేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపించడం లేదు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన, తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం బెటర్ అని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మనిషిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. ఆ పార్టీలో ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్నారు. కొద్దిరోజులుగా ఆయన ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలను ఖమ్మం నియోజకవర్గంలో చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరి మళ్ళీ ఖమ్మం బరిలో దిగాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం..
తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పేరు ఉంది. ఏపీలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి కట్టబెట్టారు. బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. జగన్ తో పలు మార్లు సమావేశం తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం కూడా జగన్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని ఆయనకు జగన్ సూచించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాహుల్ గాంధీతో టీమ్ తో పొంగులేటి చర్చలు..
కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ టీమ్ తో భేటీ అయి చర్చలు జరిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గం మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులకు సీట్లు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో బిజెపికి బలం లేదు కాబట్టి.. ఆ పార్టీలోకి వెళ్లడం కన్నా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పొంగులేటి గెలిపించుకునే వారంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అయినా.. ఎన్నికల తర్వాత గేమ్ ఆడవచ్చు అన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

జూపల్లితో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు..
ఖమ్మంలో బలమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఆ పార్టీకి బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి జూపల్లితో కూడా కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే సీనియర్ నేతలు అవసరమని భావిస్తున్న కాంగ్రెస్.. ఆదిశగా అడుగులు వేస్తోంది. బిఆర్ఎస్, బిజెపిపై అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగానే జూపల్లి, పొంగులేటిని హస్తం పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అన్ని సెట్ అయితే ఈ నెల 3న ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరింత మంది తెలంగాణ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పావులు పొదుపుతోంది.