Heat Waves: ఎండలు మండిపోతున్నాయి. బయట అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈసారి అంతకుమించి అనేలాగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత తొమ్మిది సంవత్సరాలలో ఏప్రిల్ నెలలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. కానీ ఈసారి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా నమోదవుతోంది. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతున్నాయి. ఎండాకాలంలో ఈ ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఈసారి అక్కడ 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత రికార్డు అవుతోంది.
ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిస్సత్తువకు గురవుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదాహరణకు కోల్ కతా లోని దూరదర్శన్ బ్రాంచ్లో యాంకర్ లోపాముద్ర సిన్హా వార్తలు చదువుకుంటూ గురువారం ఒక్కసారిగా గొప్ప కూలిపోయారు. 21 సంవత్సరాలుగా యాంకర్ గా పనిచేస్తున్న ఆమె ఒక్కసారిగా అలా పడిపోవడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందారు. అయితే పెరిగిన ఉష్ణోగ్రత వల్లే తనకు అలా జరిగిందని లోపాముద్ర ప్రకటించారు. ఆమె వార్తలు చదువుకుంటూ అలా పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. దూరదర్శన్ న్యూస్ కూలింగ్ రూమ్ లో ఏసీలు ఒక్కసారిగా మొరాయించాయంటే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి అర్థం చేసుకోవచ్చు.. న్యూస్ రూమ్ లో కూలింగ్ తగ్గడం వల్లే లోపాముద్ర అలా పడిపోయారని తోటి ఉద్యోగులు అంటున్నారు.
ఇక పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. దీనివల్ల ప్రజలు ఊరికే డిహైడ్రేట్ అవుతున్నారు. ఇక షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా వేడిమి తట్టుకోలేక వ్యాధుల బారిన పడుతున్నారు.. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి పసిఫిక్ మహాసముద్రం నుంచి వీస్తున్న వేడిగాలులే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం మన దేశంపై తగ్గిపోయిందని, అయినప్పటికీ అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి కొద్ది రోజులపాటు ఇలానే ఉంటుందని.. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటి వాటిని తాగితే శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి పొందచ్చని చెబుతున్నారు.