
Prem Rakshit Choreographer: నాటు నాటు సాంగ్ కి ప్రపంచమే డాన్స్ చేస్తుంది. ఆ సాంగ్ కీర్తి ఎల్లలు దాటేసింది. ఆస్కార్ గెలిచాక ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడం వెనుక చాలా మంది కృషి ఉంది. అయితే పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణి, రాసిన చంద్రబోస్ కంటే కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన పర్సన్స్ ముగ్గురు ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్. నాటు నాటు పాటకు ఇంత గుర్తింపు రావడానికి ఈ ముగ్గురే కారకులు. ప్రేమ్ రక్షిత్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్ తో పాటు పాటను కొరియోగ్రఫీ చేసిన తీరు అద్భుతం. అంతకు మించి చరణ్, ఎన్టీఆర్ ఆ పాటను వెండితెర మీద పండించారు.
ఆస్కార్ వేదిక మీద మెరిసిన ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఒక టైలర్ అంటే నమ్మడం కష్టం. ప్రేమ్ రక్షిత్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచం మెచ్చిన పాటకు డాన్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ జీవితం టైలర్ గా మొదలైంది. ఆయన ఒక టైలర్ షాప్ లో పని చేస్తూ రాజమౌళి పిల్లలకు డాన్స్ క్లాసులు తీసుకునేవాడట. దాని ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబ అవసరాలు తీర్చుకునేవారట. తమ్ముడిని చదివించుకునేవాడట.

తాను ఒక కొరియాగ్రాఫర్ అని చెబితే రాజమౌళి ఎక్కడ పని నుండి తీసేస్తాడో అని భయపడ్డాడట. ఒకరోజు విద్యార్థి మూవీలోని సాంగ్ టీవీలో చూసి, ఎవరో కొరియోగ్రఫీ బాగా చేశారని రాజమౌళి అన్నారట. పక్కనే ఉన్న ప్రేమ్ రక్షిత్ మనసులో ఉన్న ఆనందం దాచుకోలేక ఆ సాంగ్ చేసింది నేనే సార్ అని చెప్పాడట. రాజమౌళి నమ్మలేదట. జోక్ చేస్తున్నావ్ కదా? అన్నాడట. జోక్ కాదు సార్ ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ నేనే అని చెప్పాడట.
రాజమౌళి ఫోన్ చేసి కనుక్కోగా అవును ఈ సాంగ్ చేసింది ప్రేమ్ రక్షితే అని చెప్పారట. దాంతో షాకైన రాజమౌళి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదన్నాడట. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం. మీరు ఎక్కడ పని నుండి తీసేస్తారో అని భయపడి చెప్పలేదన్నాడట. అనంతరం రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ చిత్రాల్లో ప్రేమ్ రక్షిత్ కి అవకాశం ఇచ్చారట. ఆ విధంగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా సెటిల్ అయ్యాడట. నిజంగా సినిమాకు మించిన నాటకీయ పరిణామం ఇది.