
RK- Adinarayana Reddy: పవన్ కల్యాణ్‌పై వందకోట్ల వంటి చవకబారు ఆరోపణలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఈసారి తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో ద్వారా కవర్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత ఆదివారం నాగినీడుతో ఇంటర్వ్యూ చేసిన ఆర్కే.. వచ్చే ఆదివారం ఏపీ బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డితో ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఆర్కే వ్యవహారం ఎలా ఉందంటే ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా స్వరం పెంచుతున్న ఏ నాయకుడినైనా ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. ఎందుకంటే తన గురువు అధికారంలోకి రావాలి. అప్పుడే తన పత్రిక, ఛానెల్ ‘పచ్చ’గా ఉంటాయి. లేకుంటే శంకరగిరి మాన్యాలే.
అది నచ్చలేదు
జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులో ఆదినారాయణరెడ్డి ఒకరు. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు జగన్ ఫోల్డ్‌లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. కానీ ఆయనను ఎవరైనా సార్ అని పిలవాల్సి రావడం, ఆయన ఎదురుగా కుర్చీలు కూర్చున్నా సహించలేకపోవడంతో తట్టుకోలేక బయటకు వచ్చానని ఆదినారాయణరెడ్డి ఆర్కేతో చెప్పారు. మరి ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఎంతో తెలియదు. అయితే ఆదినారాయణరెడ్డి జగన్‌ను కాగితపు పులిగా అభివర్ణించాడు. ఆయన ఏదంటే అది అనే మంది మాగదుల బ్యాచ్ పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. జగన్ వ్యవహార శైలి నచ్చకనే నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు దూరమయ్యారని వ్యాఖ్యానించారు. ఏ2 కూడా దూరమ య్యారని ఆర్కేవ్యాఖ్యానించగా.. అలా దూరం ఉన్నట్టు నటిస్తారని, తెర వెనుక జరిగేది జరుగుతుం దని ఆదినారాయణరెడ్డి వివరించారు. ఒకవేళ లేకుంటే ఏ2కు అకస్మాత్తుగా గుండెపోటు వస్తుందని, అలా గుండె పోటు వచ్చిన వారు ఏమయ్యారో మనం చూశాం కదా అని ఆదినారాయణరెడ్డి వివరించారు.

జగన్ అన్నీ అబద్ధాలు చెబుతారు
జగన్ అన్ని అబద్ధాలు చెబుతారని ఆదినారాయణరెడ్డి చెప్పగా, రాంగోపాల్ వర్మతో చెప్పలేకపోయారా అని ఆర్కే అనగా ఆదినారాయణరెడ్డి ఓ నవ్వు నవ్వారు. దేశంలో జీఎస్టీ ఉందని, కానీ ఏపీలో జేఎస్టీ ఉందని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. అనంత పద్మనాభ స్వామికి నేల మాలిగలు ఉన్నట్టు జగన్‌కు కూడా నేల మాలిగలు ఉన్నాయని ఆదినారాయణరెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. అంతే కాదు జగన్‌ను బీజేపీ నాయకులు కాపాడటం లేదని స్పష్టం చేసిన ఆదినారాయణరెడ్డి.. జగన్ ఏనాడైనా జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. అంతే కాదు వివేకానందారెడ్డి హత్య కేసులో తనకు సంబంధం లేదని చెప్పిన ఆదినారాయణరెడ్డి, తప్పు చేసి ఉంటే నన్ను బహిరంగంగా ఉరితీయాలని సవాల్ విసిరారు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో యూ ట్యూబ్‌లో విడుదలయింది. ప్రోమో మాత్రం చాలా హాట్ హాట్ఆ సాగింది. ఆర్కే ప్రశ్నలు అడుగుతుంటే ఆదినారాయణరెడ్డి ఎక్కడా కూడా తడముకోకుండా సమాధానాలు చెప్పారు. ఇక పూర్తి ఇంటర్వ్యూలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారో, ఆర్కే ఎలాంటి ప్రశ్నలు అడిగారో షో టెలికాస్ట్ అయ్యేదాకా తెలియదు.