Allu Aravind- Dil Raju: నిర్మాత దిల్ రాజు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అవుతున్నారు. సంక్రాంతి సినిమాల విడుదల, థియేటర్స్ విషయంలో దిల్ రాజు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మైత్రీ మూవీ మేకర్స్ ని దెబ్బతీయాలని థియేటర్స్ లాక్ చేసి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు స్క్రీన్స్ దొరక్కుండా చేయాలని చూశాడనే అపవాదు మోశాడు. వారసుడు విడుదలతో మొదలైన వివాదం అనేక మలుపులు తీసుకుంది. ఫైనల్ గా నష్టపోయింది మాత్రం దిల్ రాజే. వారసుడు జనవరి 14న విడుదల చేసుకోవాల్సి వచ్చింది. తమిళ వెర్షన్ 11నే విడుదలైంది. వారిసు మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా అది వారసుడు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపింది.

విజయ్ స్టార్ డమ్ వలన వారసుడుతో భారీ నష్టాలు పొందలేదు. లాభాలు రాకపోయినా సేఫ్ గా బయటపడ్డాడని ట్రేడ్ వర్గాల అంచనా. అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీగా లాభపడ్డారు. వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ కాగా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. సంక్రాంతి థియేటర్స్ రచ్చలో దిల్ రాజు అటు మెగా, ఇటు నందమూరి కుటుంబాలకు శత్రువు అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ అయితే ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆ గొడవ ముగిసి నెల రోజులు కాకుండా మరో రచ్చ షురూ చేశారు.
పరశురాం-విజయ్ దేవరకొండలతో మూవీ లాక్ చేసి అల్లు అరవింద్ ఆగ్రహానికి కారణమయ్యాడు. అధికారిక ప్రకటనకు ముందే మీడియాలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ- పరశురాం మూవీ అంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలు చూసి షాకైన అల్లు అరవింద్ దిల్ రాజుకు ఫోన్ చేసి క్లారిటీ అడిగారట. అయ్యో మీ డైరెక్టర్ జోలికి నేనెందుకు వెళతాను. అవన్నీ ఫేక్ అంటూ మెసేజ్ పెట్టాడట. కానీ రాత్రికి అధికారికంగా ప్రకటించడం జరిగింది.

దీంతో అల్లు అరవింద్ ఈ వివాదం మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. టాలీవుడ్ ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. మీడియా ముందుకు వచ్చి అల్లు అరవింద్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురాంలను ఏకిపారేయడం ఖాయమని భావించారు. పరుశురాం అల్లు అరవింద్ ని శాంతపరిచే ప్రయత్నాలు చేశారట. నిన్నటి నుండి పలుమార్లు కలిసేందుకు ఇంటికి వెళితే అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఎట్టకేలకు పరశురామ్-అల్లు అరవింద్ భేటీ అయ్యారట. మీరు కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా ఉండేలా ఒప్పిస్తానని చెప్పారట.
అయినప్పటికీ అల్లు అరవింద్ చాలా కోపంగా ఉన్నారట. ముఖ్యంగా దిల్ రాజు మీద రగిలిపోతున్నారట. మీ డైరెక్టర్ తో నేను సినిమా ఎందుకు చేస్తానని చెప్పి, సాయంత్రానికి అధికారిక ప్రకటన చేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారట. ఈ క్రమంలో అల్లు అరవింద్ తో కూడా దిల్ రాజుకు చెడినట్లే అంటున్నారు.