Homeట్రెండింగ్ న్యూస్Iranian- Hijab: హిజాబ్ ధరించాలని షరతు పెడితే కాల్చేసి నిరసన తెలిపారు. ఇంతకీ ఎక్కడో తెలుసా?

Iranian- Hijab: హిజాబ్ ధరించాలని షరతు పెడితే కాల్చేసి నిరసన తెలిపారు. ఇంతకీ ఎక్కడో తెలుసా?

Iranian- Hijab: ఆడపిల్లకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొన్ని అభిరుచులు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. ఆమెను మనం ప్రోత్సహించాలి. అప్పుడే సాధికారత అనేది సాధ్యమవుతుంది. ఎలాగూ ఆడపిల్ల అని అలుసుగా తీసుకుంటే.. ఏమి చేయలేదని ఛాందస వాదాన్ని రుద్దితే.. ఆమె నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎదుర్కొనేందుకు పురుషుడి స్థాయి సరిపోదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ముస్లిం దేశమైన ఇరాన్ ఎదుర్కొంటోంది. ఆ మధ్య కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో హిజాబ్ ధరించే విషయమై జరిగిన రచ్చ చూశాం కదా! ఇప్పటికీ ఆ కేసు కోర్టులో నడుస్తోంది. కానీ యాదృచ్ఛికంగా ఇరాన్ దేశంలో అదే హిజాబ్ పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ముస్లిం చట్టాలు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ చాలామంది మహిళలు హిజాబ్ లను రోడ్డు మీద వేసి కాల్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలే అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్న ఈ రోజుల్లో తాము ఇంకా ఆ కట్టుబాట్ల మధ్య నలిగిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ మహిళలు ఆ స్థాయిలో నిరసన వ్యక్తం చేసేందుకు జరిగిన ఘటన మాములుది కాదు.

Iranian- Hijab
Iranian- Hijab

ఇంతకీ ఏం జరిగిందంటే

ఇరాన్ .. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల్లో ఒకటి. షరియా చట్టం ప్రకారం ఏడేళ్ళు దాటిన ప్రతి బాలిక ఒక డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్ ధరించాల్సి ఉంటుంది. ఇవి అక్కడి కనీస నిబంధనలట! ఇందుకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత జూలైలో ఈ నిబంధనలు మరింత కఠిన తరం చేశారు. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు భారీగా జరిమానాలు విధించాలని పోలీసులను ఆదేశించారు. హిజాబ్ చట్టాన్ని అనుసరించని మహిళలను శిక్షించేందుకు మొరాలిటీ పోలీసింగ్ అనే విభాగాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇదే క్రమంలో మోహ్సా అమినీ అనే 32 ఏళ్ళ మహిళను హిజాబ్ ధరించలేదని మొరాలిటీ పోలీసింగ్ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. కోమాలోకి వెళ్ళిపోయింది. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. ఈ ఘటనతో ఇరాన్ మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కస్టడీలో ఉన్నప్పుడు మోహ్సా అమీనాను పోలీసులు చిత్రవధకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వీటిని పోలీసులు ఖండించారు. ఈ క్రమంలోనే అమీనా మృతిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నిరసనలు మిన్నంటుతున్నాయి. వేలాదిమంది మహిళలు రోడ్లమీదకి రావడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయుగోళాలు ప్రయోగిస్తున్నారు.

జుట్టు కత్తిరించుకొని.. హిజాబ్ కాల్చేసి నిరసన

దేశ అధ్యక్షుడు కఠినమైన నిబంధనలు విధిస్తుండడంతో మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్న హిజాబ్ ను ధరించబోమంటూ మహిళలు తేల్చి చెబుతున్నారు. ఇంకా మేము రాతియుగం నాటి పరిస్థితుల్లో బతకాలా అని ప్రశ్నిస్తున్నారు. తమ జుట్టును కత్తిరించుకొని, తమ స్వేచ్ఛకు ఆటంకంగా నిలుస్తున్న హిజాబ్ ను కాల్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులకు ఇరాన్ మహిళా జర్నలిస్ట్ మసిహ్ అలిజనేద్ మద్దతు పలుకుతున్నారు. ” ఏడేళ్ళ నుంచే మమ్మల్ని హిజాబ్ ధరించమంటున్నారు. దీనివల్ల మేము కనీసం గాలి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు. స్వేచ్ఛగా ఉండాలని మాకూ ఉంటుంది. కానీ ఈ అర్థం పర్థం లేని విధానాల వల్ల మేము మా స్వేచ్ఛను కోల్పోతున్నాం.

Iranian- Hijab
Iranian- Hijab

ఒకవేళ మేం హిజాబ్ ధరించకపోతే బడిలోకి రానివ్వరు. ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు చేసుకోనివ్వరు” అంటూ ఆమె ఉద్వేగంగా ట్విట్టర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. కాగా ఆమధ్య బెంగళూరులో హిజాబ్ ధరించే విషయమై జరిగిన నిరసన ప్రదర్శనలో హింస చెలరేగింది. అయితే అదే హిజాబ్ ను తప్పనిసరి చేసిన ముస్లిం దేశాల్లో దానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మిగతా పార్టీలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలకు కనీస స్వేచ్ఛను ఇవ్వలేని దేశాలను చూసి భారతదేశం ఏమి నేర్చుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కర్ణాటకలో కావాలనే కొందరు హిజాబ్ విషయంలో లేనిపోని రగడ సృష్టించారంటూ ఆరోపించారు. కాగా మరో ఏడాదిలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇష్టం ఇరాన్ లో హిజాబ్ పై జరుగుతున్న రగడని బిజెపి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular