Homeక్రీడలుIPL 2023: కోట్లు ఖర్చు చేస్తున్న ఫ్రాంచైజీలకు.. ఆదాయం ఎలా వస్తుందంటే..

IPL 2023: కోట్లు ఖర్చు చేస్తున్న ఫ్రాంచైజీలకు.. ఆదాయం ఎలా వస్తుందంటే..

IPL 2023
IPL 2023

IPL 2023: మన దేశానికి, క్రికెట్ కు విడదీయరాని బంధం ఉంది. క్రికెటర్లను దేశ ప్రజలు దేవుళ్ళుగా కొలుస్తారు. అలాంటి క్రికెట్ 2007లో కార్పొరేట్ హంగులు అద్దుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గా రూపాంతరం చెందింది. ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 10 జట్లు ఉన్నాయి. ఈ పది జట్లను పేరు మోసిన కార్పొరేట్ కంపెనీలు లీడ్ చేస్తున్నాయి.. కోట్లకు కోట్లు పెట్టి ఆటగాళ్ళను కొనుగోలు చేసి.. ఆట ఆడిస్తున్నాయి. ఇందులో గెలుపొందిన జట్టుకు ప్రైజ్ మనీ వస్తుంది. రన్న రప్ జట్టుకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. మరి మిగతా జట్ల పరిస్థితి ఏంటి? కోట్లకు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? ఈ విషయాలను తెలుసుకుందాం రండి.

తిరుగులేని శక్తిగా నిలిపింది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త విప్లవం. ఇది భారత క్రికెట్ క్రీడా సమాఖ్యను ప్రపంచం ముందు తిరుగులేని శక్తిగా నిలిపింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శుక్రవారంతో ప్రారంభమయ్యే సీజన్ 16వది. ఈ లీగ్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. క్రీడాభిమానులకు సరికొత్త క్రీడా వినోదాన్ని పరిచయం చేస్తోంది. ఐపీఎల్ వల్ల ఇతర దేశాల స్టార్ ప్లేయర్లు భారతదేశానికి క్యూ కట్టేంత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ గా గుర్తింపు పొందింది. ఎంతమంది ఆటగాళ్ళను రాత్రికి రాత్రి కోటీశ్వరులు చేసింది. వాస్తవానికి 2007లో 8 జట్లతో మొదలైన ఐపీఎల్.. పది జట్లకు విస్తరించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్ తో బీసీసీఐకి కోట్లల్లో ఆదాయం వస్తోంది. జట్లకు కూడా అదే స్థాయిలో ఆదాయం లభిస్తోంది.

మీడియా హక్కులతో..

మీడియా హక్కుల ద్వారా ఫ్రాంచైజీలకు అత్యధికంగా ఆదాయం లభిస్తుంది. మొత్తం ఆదాయంలో 60 నుంచి 70 శాతం దాకా మీడియా హక్కుల ద్వారా ఆదాయం లభిస్తున్నది. అయితే ఈ సీజన్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఇందులో బీసీసీఐకి 48, 390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. టీవీ హక్కులను స్టార్ నెట్వర్క్ 23,575 కోట్లకు దక్కించుకుంది. డిజిటల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయోకామ్ సంస్థ రూ. 23,773 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే ఈ లెక్కన బీసీసీఐకి ప్రతి ఏడాది మీడియా రైట్స్ ద్వారా రూ..9,670 కోట్ల ఆదాయం వస్తోంది. వచ్చిన ఈ ఆదాయాన్ని 50 శాతం బీసీసీఐకి, 45 శాతం ఫ్రాంచైజీలకు, 5 శాతం ప్రైజ్ మనీ కింద విభజిస్తారు. టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా, మీడియా హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం లభిస్తుంది.

టాటా సంస్థ దక్కించుకుంది

ఇక ఐపీఎల్ 2023 సీజన్ కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా సంస్థ 439.8 కోట్లకు దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంచనుంది. ఇవి కాకుండా ప్రతి ఫ్రాంచైజీకి కొంతమంది ప్రత్యేక స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఆ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తుంటాయి. ఇలా తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటాయి.

దెబ్బతీసిన కోవిడ్

కోవిడ్ వల్ల గత మూడు సంవత్సరాలు పరిమిత వేదికలు, బయో ఓబుల్ నిబంధనల మధ్య ఐపిఎల్ జరిగింది. అంతే కాదు ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ పెద్దగా లేకుండా పోయింది. గత రెండు సీజన్లలో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించినప్పటికీ చెప్పుకోదగిన ఆదాయం అయితే రాలేదు. అయితే ఈసారి హోమ్ అండ్ ఎవే పద్ధతిలో జట్లు తలపడే అవకాశం ఉంది. ఈ ప్రకారం సొంత మైదానాల్లో ఏడు మ్యాచ్ లు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ఆయా ఫ్రాంచైజీలకే ఉంటాయి. స్టేడియం ఖర్చులు పోనూ.. గేట్ రెవెన్యూ ద్వారా ఫ్రాంచైజీలకు ఈట 15 నుంచి 25 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ప్రైజ్ మనీ, జెర్సీల అమ్మకం ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయాన్ని పొందుతున్నాయి.

IPL 2023
IPL 2023

విజేతకు 20 కోట్లు

సాధారణంగా ప్రతి సీజన్లో టైటిల్ గెలిచిన జట్టుకు 20 కోట్లు, రన్న రప్ గా నిలిచిన జట్టుకు 12.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. అంతేకాకుండా ఆటగాళ్ళను మార్చుకోవడం, తమ బ్రాండ్ టీ షర్టులు, క్యాప్ లు, ఇతర వస్తువులను విక్రయించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయాన్ని పొందుతాయి.

ఖర్చు కూడా..

వచ్చే ఆదాయంతో పాటు ఫ్రాంచైజీలకు ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. ప్రతి ఫ్రాంచైజీ.. తమ ఫైనల్ బిట్ మొత్తంలో వేట పది శాతాన్ని ఐపీఎల్ కు చెల్లించాల్సి ఉంటుంది. 35 నుంచి 45 శాతం వరకు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అనేక విధాలుగా అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular