Homeట్రెండింగ్ న్యూస్May Day : అయారే మే డే: ఆయుధమై నేడే: చికాగో కార్మికుల త్యాగం వల్లే...

May Day : అయారే మే డే: ఆయుధమై నేడే: చికాగో కార్మికుల త్యాగం వల్లే ఈ హక్కులు

May Day : హక్కు సాధించుకునేందుకు ఒక సమ్మె… జీవో జారీకి మరొక సమ్మె… దాని అమలుకు ఇంకో సమ్మె చేస్తున్న పరిస్థితుల్లో సంఘటిత కార్మికవర్గం, ఏ పూట ఉద్యోగం ఉంటుందో… ఊడుతుందో… తెలియని అభద్రత వలయంలో అసంఘటిత కార్మికవర్గం కూరుకుపోయిన నేపథ్యంలో సోమవారం యావత్‌ కార్మికవర్గం మేడే జరుపుకొంటోంది. పోరాటానికి, త్వాగానికి, అమరత్వానికి ప్రతీకగా నిలిచే మేడేను, కొడిగడుతున్న హక్కులు, సౌకర్యాల సాధనకు దీక్షా దినంగా పాటించవలసిన దినాన్ని పాలకులు, యాజమాన్యాలు పండుగ దినంగా జరుపుకొంటున్నాయి.1886 మే ఒకటిన చికాగో నగరంలో కదం తొక్కిన లక్షలాదిమంది కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికుల ఆత్మబలిదానాలు, వేలాదిమంది కార్మికులు చిందించిన నెత్తుటి ధారల సాక్షిగా నాటినుంచి నేటివరకు ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా యావత్‌ కార్మికవర్గం మేడే ఉత్తేజాన్ని గుండెలనిండా ఆస్వాదిస్తోంది.
చికాగో నగరంలో కదం తొక్కింది
ఎనిమిది గంటల పనిదినం, దయనందిన జీవన పరిస్థితుల మెరుగుదల కోసం అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే 1న కార్మిక వర్గం సంఘటితంగా కదం తొక్కింది. కార్మికవర్గ చైతన్య ప్రభంజనంతో కలవరపడిన పాలకులు పెట్టుబడిదారుల అండతో కార్మికులపై విచ్చల విడిగా జరిపిన కాల్పుల్లో అరడజను మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, వందలాదిమంది గాయపడటంతో ఆగ్రహించిన కార్మికులు ఆత్మరక్షణ కోసం జరిపిన ప్రతిఘటనలో ఏడుగురు పోలీసులు సైతం మరణించడంతో వందలాది మంది కార్మికులపై కేసులు బనాయించి జైళ్లల్లో నిర్బంధించారు. ఉద్యమానికి నాయకత్వం వహించారన్న ఆగ్రహంతో నలుగురు కార్మిక నాయకులను అమెరికా ప్రభుత్వం ఉరి తీసిన నేపథ్యం నుంచి పెల్లుబుకిన కార్మికోద్యమ చైతన్య బావుటా మేడేగా ప్రపంచ వ్యాపితంగా కార్మిక వర్గం ప్రతీ ఏటా జరుపుకొంటోంది. కార్మికుల బతుకుదెరువు పోరాటాల దిక్సూచిగా కష్టజీవుల సమస్యలపై సమరశంకం పూరించిన దినంగా పోరాడితే పోయేదేమిలేదు బానిస సంకెళ్లు తప్ప… అంటూ కార్మికవర్గం తమ హక్కుల కోసం జరిపిన సుధీర్ఘపోరాటాల ఫలితమే మేడే. సమరశీల కార్మిక ఉద్యమాల్లో రక్త తర్పణలు, బలిదానాలతో ఆవిర్భవించిన ఎర్రజెండా జైత్రయాత్ర ప్రపంచ శ్రామికవర్గానికి చైతన్య యాత్రగా అజేయంగా సాగుతోంది.
పోరాడుతూనే ఉంది
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు హక్కుల కోసం పని పరిస్థితుల మెరుగుదల కోసం ఆనాటి నుంచి నేటివరకు పోరాడుతూనే ఉంది. స్వాతంత్య్రం సిద్ధించి ఆరున్నర దశాబ్దాలు దాటుతున్న దేశీయ కార్మికవర్గం నేటికి అభద్రతా వలయంలోనే కొట్టుమిట్టాడుతోంది. పోరాటాలకు త్యాగాలకు, అమరత్వాలకు ప్రతీకగా నిలిచే మేడేను నేడు కార్మిక వర్గం కొడిగడుతున్న హక్కులు, సౌకర్యాల సాధనకు దీక్షా దినంగా పాటిస్తోంది.
అభద్రతలో కార్మిక వర్గం
అనేక పోరాటాలతో ఆవిర్భవించిన పారిశ్రామిక, కార్మికవర్గ చట్టాలను శ్రామికవర్గ పరిరక్షణకు మరింత ప్రయోజన కరంగా తీర్చిదిద్దకపోగా పాలకులు అనేక చట్టాలకు సవరణలు చేస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారన్న ఆవేదనలో కార్మికవర్గం కూరుకుపోయింది. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలనుంచి నేటివరకు కార్మిక చట్టాల సవరణలు బొగ్గు పరిశ్రమ, రైల్వే, రక్షణ, బీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, బ్యాంకింగ్‌, ఓడరేవులు, పోస్టల్‌, సేవా రంగాల్లో కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు చేయడం, పనిగంటలు మొదలుకొని కార్మిక సంక్షేమ చట్టాలు కుదిస్తున్న తీరు కార్మికవర్గాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. గ్రాట్యూటీ, పెన్షన్లు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు, ప్రావిడెంట్‌ఫండ్‌, కనీస వేతనాలు, నష్టపరిహారాలు, లీవులు, బోనస్‌, ఈఎస్‌ఐ తదితర పథకాల్లో కోతలతోపాటు ఉద్యోగ భద్రత కొరవడిందన్న ఆందోళనల్లో ఉద్యోగ కార్మిక వర్గాలు కూరుకుపోయాయి.
కార్మికసంఘాల్లో కొరవడుతున్న చిత్తశుద్ధి
చికాగో అమరవీరుల నెత్తుటితో తడిసిన శ్రామికవర్గ పతాకాన్ని సమున్నతంగా నిలబెట్టవలిసిన కార్మిక సంఘాలు కార్మికవర్గ పక్షపాతిగా నిలవకుండా యాజమాన్యాల సేవల్లో తరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. కార్మికుడికి ఏదైనా అన్యాయం జరిగితే గతంలో కార్మికసంఘాలు తీవ్రంగా స్పందించేవి. యాజమాన్యాల మెడలు వంచే వరకు ఉద్యమించేవి. అటువంటి క్రియాశీల ఉద్యమపంధా నుంచి కొన్ని ట్రేడ్‌(వ్యాపార) యూనియన్లుగా మారడం, యాజమాన్యాలు, అధికారుల అడుగులకు మడుగులు వత్తే విధంగా తయారు కావడంతో కార్మికుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది.
చందాలు, దందాలు 
కేవలం కొన్ని సంఘాలు చందాలు, సభ్వత్వాల రూపంలో లక్షలాది రూపాయలు పోగేసుకోవడం, కొందరు నాయకులు వాటాలు పంచుకోవడం, యాజమాన్యాల సానుకూల విధానాలతో యజమానుల సేవలో తరిస్తున్నతీరు మూలంగా కార్మికవర్గంలో విశ్వాసం కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొన్ని సంఘాలు మేనేజిమెంట్లు సంఘాలుగా మారడంతో నేడు కొన్ని రంగాల కార్మికుల్లో యూనియన్లు అంటేనే విముఖత ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version