Homeట్రెండింగ్ న్యూస్Moinabad: ఒక స్త్రీని మరొక స్త్రీ మోహిస్తే.. పరస్పరం కలిసి ఉండాలని భావిస్తే.. జరిగింది ఇదీ

Moinabad: ఒక స్త్రీని మరొక స్త్రీ మోహిస్తే.. పరస్పరం కలిసి ఉండాలని భావిస్తే.. జరిగింది ఇదీ

Moinabad: పురుషుడు, స్త్రీ పరస్పరం ఇష్టపడితే దానిని ప్రకృతి కారక సంబంధం అంటారు. స్త్రీ, పురుషుడి కలయిక వల్లే పిల్లలు పుడతారు. వారి వల్లే సమాజం ఏర్పడుతుంది. ఇరువురిలో ప్రత్యేకమైన హార్మోన్లు ఉంటాయి కాబట్టి స్త్రీ అంటే పురుషుడికి, పురుషుడు అంటే స్త్రీకి ఇష్టం, ప్రేమ, వాంఛ వంటివి ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో తప్ప వాటిని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఒక స్త్రీని మరొక స్త్రీ మోహిస్తే.. పరస్పరం కలిసి ఉండాలని భావిస్తే.. ప్రేమలో మునగాలి అని తలిస్తే.. ఇలాంటిదే ఆ యువతీ జీవితంలో జరిగింది. కానీ చివరికి ఆమె జీవితం విషాదాంతమైంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని బాకారం పరిసర ప్రాంతాల్లో కాలిపోయిన స్థితిలో యువతీ మృతదేహం ఇటీవల లభించింది. అయితే ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు.. దాని వెనుక కారణాలు ఏమి ఉంటాయా అని విచారణ చేయడం మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత వారికి దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలిసాయి. చనిపోయిన యువతి హైదరాబాద్ మహానగరంలోని మల్లేపల్లి ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల యువతిగా గుర్తించారు. ఆ యువతి సెల్ ఫోన్ తో పాటు సిసి ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలించారు. ఆ యువతి మదిన కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే తనతో పాటు చదివే ఓ యువతితో మొదట స్నేహం చేసింది. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడింది. అయితే ఈ విషయం తెలిసిన ఆ యువతి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయితే తన స్నేహితురాలి ఎడబాటును తట్టుకోలేక ఆ యువతి బ్లేడ్ తో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సదరు యువతి ప్రేమించిన స్నేహితురాలికి ఆమె కుటుంబ సభ్యులు వివాహ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ యువతికి ఈ విషయం తెలియడంతో తీవ్రమైన మనస్థాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ వేసుకొని ఏడవడం మొదలు పెట్టింది. కుటుంబ సభ్యులు ఉరడించడంతో బయటికి వచ్చింది. ఆ తర్వాత ఈ నెల 7న సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్లి ఒక డబ్బాలో ఐదు లీటర్ల పెట్రోల్ పోయించుకుంది. మురాధన్ నగర్ లోని తన మరో స్నేహితురాలు ఇంట్లో పెట్టింది. ఎందుకు ఈ పెట్రోలు అని ఆ స్నేహితురాలు ప్రశ్నిస్తే బయట కొరతగా ఉందని.. తన ద్విచక్ర వాహనంలో పోయించేందుకు తీసుకున్నానని.. ఎప్పుడైనా అవసరం పడితే తీసుకెళ్తానని ఆమెకు చెప్పింది. ఈ మాటలను ఆ స్నేహితురాలు కూడా నమ్మింది. ఇక ఈనెల 8న ఉదయం 8గంటల 30 నిమిషాలకు ఆ యువతి మైనాబాదులోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కు వెళ్లాలని చెప్పి ఓ ఆటోలో 1100 రూపాయలకు మాట్లాడుకుంది. ఆటోలో మురాదా నగర్ లోని తన స్నేహితురాలు ఇంటికి వెళ్లి పెట్రోల్ డబ్బాను తీసుకొని అదే ఆటోలో తన ఇంటికి వెళ్ళింది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు మరో స్నేహితురాలు ఇంటికి వెళ్లి 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆ పెట్రోల్ డబ్బాను తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఆటో ఎక్కింది. మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు మొయినాబాదులోని బాకార సమీపంలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ గేటు వద్దకు రాగానే ఆటోను యూటర్న్ తీసుకోవాలని డ్రైవర్ కు చెప్పింది. డ్రైవర్ అలాగే చేయడంతో ఆటోను ఆపి అతడికి డబ్బులు ఇచ్చి పంపింది. మధ్యాహ్నం ఒంటిగంట 53 నిమిషాలకు తను ప్రేమించిన యువతితో ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు చెప్పడంతో మొదట వారు ఈ కేసును అనుమానాస్పద మృతి గానే నమోదు చేశారు. ఆమె మృతదేహం దగ్గర సగం కాలిపోయిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. ఆమె చివరగా మాట్లాడిన స్నేహితురాలిని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.

అయితే ఈ నెల 8న తన సోదరి ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు కనుక సత్వరమే స్పందించి ఉంటే తమ సోదరి బతికి ఉండేదని ఆమె సోదరుడు చెబుతున్నాడు. తన చెల్లి ఫోటో కూడా పోలీస్ స్టేషన్ లో ఇచ్చామని.. కానీ పోలీసులు సకాలంలో స్పందించలేదని వాపోయాడు. ఆధార్ కార్డు తెస్తేనే ఫిర్యాదు తీసుకుంటామంటూ పోలీసులు చెప్పడంతో.. ఇంట్లో ఎంత వెతికినా తన సోదరి ఆధార్ కార్డు దొరకలేదని ఆ యువకుడు వాపోయాడు. చివరికి బాకారం ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతి చెందిన విషయం తెలియడం.. స్మార్ట్ ఫోన్ ఆధారంగా చనిపోయింది తమ చెల్లి అని గుర్తించామని ఆమె సోదరుడు చెబుతున్నాడు. కాగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై పై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. ఆ యువతి మృతికి సంబంధించి పూర్తిగా విచారణ చేసి మరిన్ని వివరాలు తన సమర్పించాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ పోలీసులను ఆదేశించారు. కాగా ఆ యువతి ఆత్మహత్య ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular