Uday Krishna Reddy: చాలామందికి జీవితం వడ్డించిన విస్తరి కాదు. కష్టాలు ఉంటాయి. కన్నీళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ధైర్యంగా అధిగమించినవారే విజేతలవుతారు. తిరుగులేని స్థాయిలో నిలబడతారు. వారు నిలబడటమే కాకుండా, పదిమందినీ నిలబెడతారు. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అటువంటిదే.. జీవితం అంటే పూల పాన్పు కాదు.. కష్టాల కొలిమి అని.. అందులో ఎంత రాటు తేలితే.. అంత పైకి ఎదుగుతామని నిరూపించాడు ఈ కానిస్టేబుల్ అలియాస్ సివిల్ ర్యాంకర్.. తన ప్రయాణంలో.. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో ఇబ్బందులు.. ఎన్నడూ బాధపడలేదు.. నాకే ఎందుకు ఇలా అంటూ తిట్టుకోలేదు. ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, కలబడ్డాడు, నిలబడ్డాడు, చివరికి సివిల్స్ ర్యాంకరై రేపో, మాపో కలెక్టర్ గా అపాయింట్ కానున్నాడు. ఇంతటి ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న అనుభవాలు, సవాల్ చేసిన అడ్డంకులపై ప్రత్యేక కథనం.
అతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి.. సొంత ఊరు ఉల్లపాలెం. సింగరాయకొండ పాలెం మండలం ప్రకాశం జిల్లా.. చిన్నప్పుడే అతడు తన తల్లిని కోల్పోయాడు. కొద్ది సంవత్సరాలకే తండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ దశలో అతడికి అన్నీ నానమ్మ రమణమ్మే అయింది. ఆమె ఆ రోజుల్లో కూరగాయల వ్యాపారం చేసేది. దానిని చేసుకుంటూనే మనవడిని చదివించింది. చిన్నప్పటినుంచే ఏదైనా అనుకుంటే దానిని సాధించే గుణం కృష్ణారెడ్డికి ఉండేది. అందుకే అతడు పోలీస్ కావాలని అనుకునేవాడు. అలా కష్టపడి చదువుకొని.. 2012లో పోలీస్ రిక్రూట్మెంట్ లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. అప్పటికి అతని వయసు 19 సంవత్సరాలు. ఓ ఉన్నతాధికారి 2019లో అవమానించడంతో కృష్ణారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
తన లక్ష్యం సివిల్స్ గా నిర్దేశించుకుని.. తన మకాం హైదరాబాద్ కు మార్చాడు. అనంతరం సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఢిల్లీ వెళ్ళాడు. ఆ తర్వాత హైదరాబాదులో కోచింగ్ తీసుకున్నాడు. మూడుసార్లు సివిల్స్ పరీక్ష రాశాడు. వైఫల్యమే ఎదురు కావడంతో ఈసారి ఎలాగైనా కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా నాలుగోసారి బలంగా అనుకొని.. పకడ్బందీ ప్రణాళికతో చదివాడు. సీన్ కట్ చేస్తే 780 ర్యాంక్ సాధించాడు. తనకు ఈ ర్యాంకు రావడం పట్ల కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇదంతా తన నానమ్మే చలవే అని చెబుతున్నాడు. ఆమె రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అంటున్నాడు.. అదే తన నానమ్మకు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతిని కృష్ణారెడ్డి చెప్పలేదు. ఇప్పటికీ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగంలో కొనసాగుతున్నట్టే ఆమె భావిస్తోందట. అయితే తాను సివిల్స్ ర్యాంకు సాధించిన విషయాన్ని నానమ్మ రమణమ్మకు చెప్పి.. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నాడు.
సివిల్స్ కు ప్రిపేరయ్యే సమయంలో కృష్ణారెడ్డి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నాడు. బలమైన లక్ష్యాన్ని ఎంచుకొని నిత్యం పుస్తకాలను చదివేవాడు. “మొదటగా చదివాను. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని భావించాను. ఆ దిశగా సంకల్పించుకున్నాను. అయితే ప్రజాసేవలో అత్యుత్తమ అధికారిగా పేరు తెచ్చుకోవాలనుంది. చిన్నప్పుడే అమ్మ దూరం కావడంతో నాలో కొంచెం ఆధ్యాత్మిక చింతన ఎక్కువని” కృష్ణారెడ్డి చెబుతున్నారు. కాగా, ఆయన సివిల్స్ ర్యాంక్ సాధించగానే గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.