Vijayalakshmi: అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ.. కాదేదీ కవితకు అనర్హం అని అప్పట్లో శ్రీ శ్రీ రాశాడు. ఇప్పుడు యూ ట్యూబ్ రోజులు గనుక వండే వంట, పెంచుకునే కుక్క పిల్ల, కొంచెం చాదస్తం.. కావేవీ ఛానల్ కు అనర్హం అని అనుకోవాలి.. ఎందుకంటే కేవలం పై వాటి ఆధారంగా ఓ మహిళ యూ ట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. ఏకంగా 30 లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అంటున్న ఈమె.. యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

2015 లో ప్రారంభం
ఆమె పేరు విజయలక్ష్మి. స్వస్థలం అనంతపురం. ఈమె భర్త రామచంద్ర. ఎస్ కే యూ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేసే వారు. వీరికి ముగ్గురు పిల్లలు మౌనిక, రఘు, వినోద్.. వీరంతా సాప్ట్ వేర్ ఉద్యోగులే. రామచంద్ర ది పెద్ద కుటుంబం. వారి కుటుంబం లో అతడే పెద్ద వాడు. విజయ లక్ష్మి ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో పెద్ద కోడలు అయ్యారు. ఇంటి పని, ఇతర బాధ్యతలతో ఆమెకు ఊపిరి సలపని పని ఉండేది. కనీసం ఆమె టీవీ ముఖం కూడా చూసి ఉండదు. అయితే 2015 లో సరదాగా యూ ట్యూబ్ చానెల్ ప్రారంభించారు. తన అనుభవాలు, వంటల వీడియోలు పోస్ట్ చేసేవారు. ఎడిటింగ్, క్యాప్షన్ అన్ని కూడా విజయలక్ష్మి కూతురు మౌనిక చూసుకునేవారు. అయితే కేవలం వంటలు మాత్రమే కాదు నీ అనుభవాలు కూడా పంచుకోవాలని ఆమె కూతురు సలహా ఇచ్చారు.
ఇప్పటి తరంలో పిల్లలు అమ్మమ్మలు, నానమ్మ ల దగ్గర పెరగడం మారుదు.. వాళ్లకి కుటుంబ ప్రేమలు, విలువలు నేర్పాలనుకుని విజయలక్ష్మి నిశ్చయించుకుంది.. ఉదాహరణలతో చెప్పాలని ” అమ్మా కొడుకు, నానమ్మ- మనవడు, మనవరాలు” అనే సిరీస్ మొదలుపెట్టారు.. అయితే వీటిలో విజయలక్ష్మి నటించారు అని చెప్పే కంటే జీవించారు అనడం సబబు. తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను, ఇబ్బందులను ఈ సీరీస్ ల్లో జోడించారు. కాకపోతే చివరిలో సందేశాన్ని జోడిస్తున్నారు.. కొద్ది రోజుల్లో వీటికి విశేష స్పందన వచ్చింది.. రెండు నెలల్లోనే 10 లక్షల మంది వ్యూయర్స్ పెరిగారు.. విజయలక్ష్మి నటన పట్ల చాలామంది ఇష్టం పెంచుకొని అందరూ ” పెద్దమ్మ, అమ్మ, ఆంటీ, అమ్మమ్మ” అంటూ మెసేజ్ లు పెట్టేవారు. మొదట్లో కెమెరా ముందుకు రావడానికి భయపడ్డ విజయలక్ష్మి… ఈరోజు లక్షల మంది తనను ఇంట్లో వ్యక్తి లాగా చూస్తా ఉంటే ఆశ్చర్యపోతోంది. బయటికి వెళ్తే గుర్తుపట్టి, సెల్ఫీలు తీసుకుంటుంటే ఆమె చాలా ఆనందపడేవారు.
2018లో పెద్ద షాక్
ఇలా సాగుతున్న విజయలక్ష్మి జీవితంలో ఆమె భర్త 2018లో కన్నుమూశారు.. ఇది ఆమెకు కోలుకోలేని షాక్.. ఇటు చూస్తే పిల్లలు దగ్గర లేరు. అటు చూస్తే కట్టుకున్న భర్త కన్ను మూశాడు.. జీవితం మొత్తం ఆమెకు శూన్యంలా కనిపించింది. దీంతో విజయలక్ష్మి కూతురు మౌనిక ” నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. నిరాశ పడితే ఉపయోగం ఉండదు” అని చెప్పడంతో విజయలక్ష్మి మళ్ళీ తన లోకంలోకి వెళ్లిపోయింది. అన్నట్టు విజయలక్ష్మి ఇప్పటివరకు 400 వీడియోలు.

32 లక్షల వ్యూవర్స్ ను సంపాదించుకుంది.. 250 కోట్ల వ్యూయర్ షిప్ సంపాదించుకుంది. యూట్యూబ్ నుంచి సిల్వర్, గోల్డ్ ప్లే బటన్ లు పొందింది. అంతేకాదు తన భర్త పేరు మీదుగా వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది. ఇంతకు చెప్పడం మర్చిపోయాం .. విజయలక్ష్మి ఛానల్ పేరు “చిన్ను 6542″.. ఇందులో చిన్ను అంటే విజయలక్ష్మి కుక్కపిల్ల. 65 ఆమె భర్త ఫోన్ నెంబర్, చివరి రెండు సంఖ్యలు ఆమె పిల్లల పుట్టిన తేదీలు. ” వయసు అనేది ఒక అంకె మాత్రమే. వయసు పెరుగుతోంది అని ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందవద్దు. ఆడవాళ్లు వంటింటి కుందేళ్ళు అని అందరూ హేళన చేస్తూ ఉంటారు. అలాంటి హేళన నుంచే నేను పుట్టుకొచ్చాను. ఇవాళ ఈ స్థాయికి ఎదిగాను” అని విజయలక్ష్మి చెపుతుంటే.. ఆమె పట్ల ఆమెకు ఎంతటి ఆత్మవిశ్వాసం ఉందో ఇట్టే అర్థమవుతుంది.