Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu- KCR: చంద్రబాబు ఫెయిలయ్యింది.. కేసీఆర్ పాస్ అయ్యింది అక్కడే..

Chandrababu- KCR: చంద్రబాబు ఫెయిలయ్యింది.. కేసీఆర్ పాస్ అయ్యింది అక్కడే..

Chandrababu- KCR
Chandrababu- KCR

Chandrababu- KCR: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుది విభిన్నమైన రాజకీయ శైలి. ఒకరు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుండగా.. మరొకరు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో తనదైన స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరిద్దరి నాయకుల రాజకీయ పరిస్థితిని ప్రస్తుతం గమనిస్తే విభిన్నంగా అనిపించక మానదు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి స్పీడ్ మీద ఉండగా.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వలేదన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఆ తరువాత సుదీర్ఘకాలం పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండు ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించి ముఖ్య మంత్రి పీఠాన్ని అధిరోహించారు. విభజన తర్వాత జరిగిన ఏపీలో మొదటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, 2019లో జరిగిన ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈ ఇద్దరు రాజకీయ నాయకులను దగ్గర నుంచి పరిశీలిస్తే ఒక అంశం దగ్గరగా కనిపిస్తుంది.

జాతీయస్థాయి రాజకీయాల వైపు కేసీఆర్.. రాష్ట్రానికే పరిమితమైన చంద్రబాబు..

ఒకప్పుడు జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఒకానొక దశలో ప్రధాన మంత్రులను కూడా నిర్ణయించినట్లు చెబుతారు. నేషనల్ ఫ్రంట్ కు గతంలో కన్వీనర్ గా కూడా చంద్రబాబునాయుడు వ్యవహరించారు. అప్పట్లో జాతీయస్థాయి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చురుకుగా వ్యవహరించేవారు. అయితే, దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితులు మారాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టేశారు. గతంలో ఎన్డీఏ 1 హయాంలో చంద్రబాబు నాయుడుకు దక్కిన ప్రాధాన్యం.. నరేంద్ర మోడీ హయాంలో ఏర్పాటు అయిన ఎన్డీఏ 2 లో మాత్రం చంద్రబాబునాయుడు కు ప్రాధాన్యం దక్కడం లేదు. 2019లో బిజెపితో కలిసి రాష్ట్రంలో అధికారాన్ని చేజెక్కించుకున్నప్పటికీ.. కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ చంద్రబాబుకు ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వలేదు. బిజెపి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రభావవంతమైన నేతగా మాత్రం కనిపించకుండా పోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనూ ఓటమి చవిచూడడంతో.. రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించే పనిలో చంద్రబాబు పడిపోయారు. దీంతో జాతీయస్థాయి రాజకీయాలు అన్న విషయాన్ని పూర్తిగా చంద్రబాబు విస్మరించారు. చంద్రబాబుతో పోలిస్తే పూర్తి భిన్నమైన పరిస్థితి తెలంగాణ సీఎం కేసీఆర్ కు కనిపిస్తుంది. రెండుసార్లు ఇంట గెలిచినా కేసిఆర్ జాతీయస్థాయిలో రచ్చ గెలవాలని భావిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. జాతీయస్థాయి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అన్న భావన ఆయనలో కలిగింది. అందుకు అనుగుణంగానే టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చి జాతీయస్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పి.. ఇప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాలకు పరిమితం కాగా, కెసిఆర్ మాత్రం రాష్ట్రస్థాయి రాజకీయాలకు మొన్నటి వరకు పరిమితమై ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల వైపు ప్రయాణం సాగిస్తున్నారు.

కెసిఆర్ కు కలిసి వచ్చింది.. చంద్రబాబుకు సమస్యగా మారింది..

తెలంగాణలో, కేంద్రం కెసిఆర్ పోరాటం చేస్తున్నది భారతీయ జనతా పార్టీతోనే. దీంతో కేసీఆర్ కు సమస్య లేకుండా పోయింది. రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ తన శత్రువు కావడంతో దూకుడుగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. అయితే చంద్రబాబు నాయుడుకు భిన్నమైన పరిస్థితి ఇక్కడ దాపరించింది. రాష్ట్రంలో వైసీపీతో పోరాటం సాగిస్తూనే.. బిజేపి తో మిత్రత్వం కోరుకునే ప్రయత్నాలను టిడిపి చేస్తోంది. ఇది కొంత టిడిపికి ఇబ్బందులు కలిగించే పరిణామంగా మారింది. బిజెపి కాకుండా జాతీయ స్థాయిలో మరో కోటమితో వెళ్లేందుకు చంద్రబాబుకు అవకాశం లేకుండా పోయింది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలోనూ మిగిలిన పక్షాలు బలంగా లేకపోవడంతో ఆయన ఎటు అడుగులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే బీజేపీతో సఖ్యతగా ఉండడమే మంచిదని ఆయన భావించారు. ఒకవేళ కాదు కూడదని పోరాటం సాగించేందుకు సిద్ధమైతే.. రాష్ట్రంలో ఉన్న వైసీపీతో, కేంద్రంలో ఉన్న బిజెపితో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే జాతీయస్థాయి రాజకీయాలకు పూర్తిగా చంద్రబాబు దూరమై రాష్ట్రస్థాయి రాజకీయాలకు పరిమితమయ్యారు.

Chandrababu- KCR
Chandrababu- KCR

కేటీఆర్ కు ఓకే.. లోకేష్ కు ఇబ్బందిగా ఉండటమే సమస్య..

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పటికే రాజకీయంగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. కెసిఆర్ కుమారుడు గానే కాకుండా ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలు కేటీఆర్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడంలో ఎటువంటి ఇబ్బందులు కేసీఆర్ కు ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఉంది. లోకేష్ ఇంకా తన సమర్థతను నిరూపించుకోవాల్సి ఉండడంతో.. ఎప్పటికీ ఇప్పుడు లోకేష్ కు బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావడమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి అజెండాగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ ఇప్పటికీ రాజకీయంగా పూర్తిస్థాయిలో ఇన్స్టాల్ కాలేదని చెప్పాలి. తండ్రిగా లోకేష్ ను పూర్తిస్థాయిలో ఇన్ స్టాల్ బాధ్యత చంద్రబాబునాయుడు పై ఉంది. అందుకే ఆయన ఇప్పటికిప్పుడు జాతియ స్థాయి రాజకీయాల వైపు వెళ్లకుండా.. గత స్మృతులను నెమరు వేసుకుంటూ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

RELATED ARTICLES

Most Popular