Chandra Shekhar Ghosh: శీర్షిక చదివి.. మేం చెబుతున్నది మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి అనుకునేరు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చదవబోయే వ్యక్తి జీవిత చరిత్ర కష్టేఫలి అనే నానుడికి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. చిన్నప్పుడు అతడు కడు పేదరికాన్ని అనుభవించాడు. తినడానికి తిండి లేదు. తొడుక్కోవడానికి సరిగ్గా బట్టలు కూడా ఉండేవి కావు. అలాంటి కష్టాల నుంచి అతడు వందల కోట్ల అధిపతిగా మారాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఎలా ఆ స్థాయికి ఎదిగాడు?
అతడి పేరు చంద్రశేఖర్ ఘోష్ (Chandrashekhar Ghosh) బంధన్ బ్యాంక్ (Bandhan Bank) యజమాని. తన కష్టంతో బ్యాంకు అధిపతిగా ఎదిగాడు. నైపుణ్యంతో పనిచేస్తే ఎలా అయినా జీవితాన్ని గెలవచ్చని.. జీవితంలో స్థిరపడచ్చని.. పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగొచ్చని అతడు నిరూపించాడు. పని విషయంలో సిగ్గుపడకుండా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటే బిలియనీర్ గా మారడం పెద్ద కష్టం కాదంటూ నిరూపించాడు.
1960లో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాజధాని అగర్తలలో చంద్రశేఖర్ జన్మించాడు.. చిన్నప్పుడు ఇతడి తండ్రికి మిఠాయి దుకాణం ఉండేది. చంద్రశేఖర్ కుటుంబం తనకు ఊహ తెలియనప్పుడే బంగ్లాదేశ్ నుంచి త్రిపురకు వచ్చింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో వారు శరణార్థులుగా త్రిపుర రాష్ట్రానికి వచ్చారు. అలా జీవనోపాధి కోసం అగర్తల ప్రాంతంలో చిన్న మిఠాయి దుకాణం పెట్టుకున్నారు. ఆ మిఠాయి దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే చంద్రశేఖర్ కుటుంబంలోని 9 మంది జీవించేవారు. ఆ షాప్ ద్వారా అంతంత మాత్రం గానే ఆదాయం వచ్చేది. ఫలితంగా చంద్రశేఖర్ కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలు అనుభవించేది. అప్పుడప్పుడు చంద్రశేఖర్ తన తండ్రికి మిఠాయి దుకాణంలో సహాయం చేసేవాడు.. ఇంటింటికి వెళ్లి పాలు కూడా అమ్మేవాడు. అలా చిన్నపాటి ఉద్యోగం చేస్తూనే చదువుకున్నాడు. త్రిపుర ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ వరకు చదివాడు.
ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం బంగ్లాదేశ్ వెళ్ళాడు. ఢాకా యూనివర్సిటీలోని స్టాటిస్టిక్స్ లో 1978లో పట్టభద్రుడయ్యాడు. అక్కడ చిన్న పిల్లలకు ట్యూషన్ చెబుతూ తన ఖర్చులు వెళ్లదీసుకునేవాడు. రూమ్ తీసుకొని ఉండేంత డబ్బులు లేకపోవడంతో ఢాకాలోని బ్రోజో నంద్ సరస్వతి ఆశ్రమంలో వసతి పొందేవాడు. మాస్టర్స్ పూర్తి కావడంతో 1985లో అతడికి ఢాకాలోని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (BRAC) లో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో భాగంగా అక్కడి గ్రామంలోని మహిళలు చిన్నచిన్న ఆర్థిక సహాయాలతో తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడాన్ని దగ్గరుండి చూశాడు. వారు చేస్తున్న ఆ పనులు చూసి ముగ్ధుడయ్యాడు. అలాంటి వాటిని భారతదేశంలోనూ అమలు చేయాలనే ఆలోచన అప్పట్లోనే అతడిలో మొగ్గ తొడిగింది. చంద్రశేఖర్ బంగ్లాదేశ్లో దాదాపు 15 సంవత్సరాలపాటు పనిచేశాడు. 1997లో కోల్ కతా కు తిరిగి వచ్చాడు.
1998లో గ్రామ సంక్షేమ సంఘం లో పనిచేశాడు. ప్రజలకు వారి హక్కుల పైన అవగాహన కల్పించాడు. అనంతరం 2001లో చంద్రశేఖర్ బంధన్ అనే పేరుతో మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. తన బావమరిది ద్వారా రెండు లక్షలు అప్పు తీసుకొని ఈ బ్యాంకు ప్రారంభించాడు. ఈ బ్యాంకుకు అనుసంధానంగా బంధన్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా మొదలుపెట్టాడు. 2002లో SIDBI అనే సంస్థ నుంచి 20 లక్షలు రుణంగా పొందాడు. ఆ ఏడాది బంధన్ సంస్థ ద్వారా సుమారు 1100 మంది మహిళలకు 15 లక్షల రుణాలు అందించాడు. అప్పట్లో అతడి కంపెనీలో కేవలం 12 మంది మాత్రమే ఉద్యోగులు ఉండేవారు.
2009లో చంద్రశేఖర్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ద్వారా బంధన్ ను NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా నమోదు చేసుకున్నాడు. ఇలా నమోదు చేయడంతో 80 లక్షల మంది మహిళల జీవితాలు మారిపోయాయి. 2013లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఏర్పాటుకు ప్రైవేటు రంగం నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అలా బ్యాంకింగ్ లైసెన్స్ పొందడానికి చంద్రశేఖర్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. 2015లో బ్యాంకింగ్ లైసెన్స్ పొందాడు. ఫలితంగా బంధన్ బ్యాంక్ ఏర్పాటయింది.. ప్రస్తుతం బంధన్ బ్యాంకు మార్కెట్ క్యాప్టలైజేషన్ 28, 997 కోట్లుగా నమోదయిందంటే దాని వెనుక చంద్రశేఖర్ కృషి అపారమైనది. ఈ బ్యాంకుకు ప్రస్తుతం 3.26 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ బ్యాంకు దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో వందలాదిగా బ్యాంకింగ్ అవుట్ లెట్ లను కలిగి ఉంది.