
Rama Navami: ప్రతి రోజు రాత్రి ఏడయ్యిందంటే చాలు భద్రాద్రి రామాలయంలో దర్బారు సేవ నిర్వహిస్తారు. శ్రీరామనవమి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రామయ్యకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ సేవ కేవలం భద్రాచలంలో మాత్రమే చేస్తారు. ఈ సమయంలో శ్రీ సీతారామచంద్రస్వామి మహాప్రభువుకు రాజరికాన్ని ప్రతిబింబించే ప్రభుత్వోత్సవం (దర్బారు సేవ) నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆలయంలోని సిబ్బంది మొత్తం ఈ సేవలో పాల్గొనాలనేది నియమం. ప్రతి రోజు ఆలయానికి వచ్చే ఆదాయ వ్యయాలను స్వామి వారికి తెలియజేస్తారు. దర్బారు సేవ జరిగే సమయంలో దివిటీ సలాం అనే పద్ధతి ఉంటుంది. అంటే రెండు దివిటీలను కలిపి ఒక చోట నమస్కారం వలే పట్టుకున్నప్పుడు స్వామి వారికి హరిదాసులు బహుపరాక్… బహుపరాక్‌లు పలుకుతారు. ఇలా దివిటీ సలాం జరిగే సమయంలో భక్తులు తమ కోర్కెలు స్వామి వారికి విన్నవించుకుంటే నెరవేరుతాయనే విశ్వాసం ఉంది. దర్బారు సేవలో హరిదాసులు ఆలపించే కీర్తనలు భక్తులను భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తాయి. ఈ క్షేత్రంలో ఈ సేవ అత్యంత ప్రాచుర్యమైంది. ఈ సేవను ప్రతి రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, విశేషోత్సవాలు జరిగే సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో ఈ ఉత్సవాన్ని తప్పక నిర్వహిస్తుంటారు.
దర్బారు సేవను ప్రవేశపెట్టింది రాజా తూము నరసింహదాసు
భద్రాద్రి రామయ్యకు పోకల దమ్మక్క, భక్తరామదాసు, తూము నరసింహదాసులకు అవినాభావ సంబందం ఉంది. పోకల దమ్మక్క పుట్టలో ఉన్న రాముణ్ని చూసి పూజలు చేసింది.
భక్తరామదాసు తానీషా హయాంలో అధికారిగా పని చేసినప్పుడు గోదావరి నదీ తీరాన ఆలయాన్ని నిర్మించడంలో అత్యంత కీలక పాత్ర వహించారు. అనంతరం ఆయన ఎన్నో కీర్తనలను గానం చేశారు. అయితే వీరు ఇరువురి కోవలోనే రాజా తూము నరసింహదాసు ఆలయంలో ఎన్నో సేవలకు శ్రీకారం చుట్టారు. అందులో అత్యంత కీలకమైంది దర్బారు సేవ. 18వ శతాబ్దానికి చెందిన రాజా తూము నరసింహదాసు ఆలయంలో మొట్టమొదటిసారిగా దర్బారు సేవనుప్రవేశపెట్టారు. దీంతో సంకీర్తనలకు అనుగుణంగా స్వామి వారి ఆరాధానలు జరిగే విధానం కూడా ఇక్కడే ఆరంభమైంది. నాటి నుంచి నేటి వర కు దర్బారు సేవ కొనసాగుతుండటమే కాకుండా దేశంలోని ఇతర దేవస్థానాలు దీనిని ఆదర్శంగా తీసుకొని నిర్వహిస్తున్నారు.

అత్యంత కీలకం దర్బారు సేవ
రాజా తూము నరసింహదాసు ఆలయంలో సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు దశ సేవోత్సవాలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ఈ సేవల్లో అత్యధిక శాతం కొనసాగుతున్నా ఇందులో భక్తుల దర్శనార్థం మూడు సేవలు ఉండటం విశేషం. ఇందులో తొలుత సుప్రభాత సేవ, అనంతరం ప్రబోతోత్సవం (దర్బారు సేవ), చివరిది పర్యంకోత్సవం (పవళింపు సేవ). ఈ మూడు సేవలను తరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని వేలాది మంది భక్తులు ఆకాంక్షిస్తారు. కొంత మంది భక్తులు ప్రత్యేకంగా ఈ సేవలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు.