Homeజాతీయ వార్తలుMinister Nirmala Sitharaman- Revanth Reddy: ఏమమ్మా నిర్మలమ్మా.. హిందీ రాదని తెలుగోళ్లను అవమానిస్తావా? 

Minister Nirmala Sitharaman- Revanth Reddy: ఏమమ్మా నిర్మలమ్మా.. హిందీ రాదని తెలుగోళ్లను అవమానిస్తావా? 

Minister Nirmala Sitharaman- Revanth Reddy: భారత జాతీయ భాష హిందీ విషయంలో లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. ఒక దశలో వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్‌ కూడా రేవంత్‌రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రశ్న అడిగిన విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెటకారం చేశారు. ఆయన చాలా వీక్‌ హిందీలో అడిగారని.. తాను కూడా వీక్‌ హిందీలో చెబుతానంటూ మాట్లాడటంతో వివాదం ప్రారంభమయింది. ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్‌ మాట్లాడిన హిందీ భాషపై నిర్మల అభ్యంతరం తెలుపడం, అవమానించేలా మాట్లాడడంపై తెలుగు రాష్ట్రాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Minister Nirmala Sitharaman- Revanth Reddy
Minister Nirmala Sitharaman- Revanth Reddy

రేవంత్‌ వర్సెస్‌ నిర్మలా సీతారామన్‌
లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి పతనంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఆయన హిందీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రూపాయి పతనంపై ప్రధానమంత్రి మోదీ.. గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పట్లో మోదీ.. రూపాయి ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారని.. మరి ఇప్పుడు రూపాయి ఏ స్థితికి వెళ్లిందని ప్రశ్నించారు.

వ్యంగ్యంగా స్పందించిన నిర్మల
రేవంత్‌ ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బదులిచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ వీక్‌ హిందీలో అడిగిన ప్రశ్నకు వీక్‌ హిందీలోనే ఆన్సర్‌ చెబుతానంటూ కౌంటర్‌ ఇచ్చారు. గతంలో ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంటే… ఇప్పుడు మాత్రం పరుగులు పెడుతోందని నిర్మల చెప్పారు. ‘కాంగ్రెస్‌ సభ్యుడు.. మోదీ అలనాటి వ్యాఖ్యలను ప్రస్తావించే ముందు, నాటి ఆర్థిక సూచీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఐసీయూలోనే ఉంది. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. ఇందుకు గర్వించాల్సింది పోయి అసూయ పడుతున్నారు’ అని మండిపడ్డారు.

తాను శూద్రుడినన్న రేవంత్‌
అయితే తన హిందీ భాషపై నిర్మలా సీతారామన్‌ చేసివ వ్యంగ్య వ్యాఖ్యలకు రేవంత్‌రెడ్డి కూడా కౌంటర్‌ ఇచ్చారు. తన హిందీ భాషను ఉద్దేశించి నిర్మల చేసిన కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేను శూద్రుడిని, నాకు స్వచ్ఛమైన హిందీ రాదు.. నిర్మలగారు బ్రాహ్మణవాది, మంచి హిందీ మాట్లాడుతారు’అని కౌంటర్‌ ఇచ్చారు. కులం, మతానికి సంబంధించిన వ్యాఖ్యలు ఎవరూ సభలో చేయకూడదని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. రేవంత్‌ రెడ్డి ప్రశ్న అడుగుతున్న సమయంలో.. జోక్యం చేసుకున్న స్పీకర్‌.. నేరుగా ప్రశ్న అడగాలని సూచించారు. అయితే తనకు మధ్యలో అంతరాయం కలిగించొద్దని స్పీకర్‌ తో రేవంత్‌ అన్నారు. ఇలా అనడంపై స్పీకర్‌ అభ్యంతరం చెప్పారు. స్పీకర్‌తో అలా ప్రవర్తించకూడదని సభ్యులకు చెప్పాలని లోక్‌ సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరికి స్పీకర్‌ సూచించారు.

Minister Nirmala Sitharaman- Revanth Reddy
Minister Nirmala Sitharaman- Revanth Reddy

‘‘నిర్మలమ్మ హిందీ ఏమన్నా గొప్పగుంటదా.. మీరు పుట్టినూరు తమిళనాడు, మెట్టినూరు ఏపీ.. ఆరెండు రాష్ట్రాలోళ్ల కన్నా తెలంగాణావాళ్లే హిందీ బాగా మాట్లాడుతారు.. ఒకరిద్దరు తప్ప మన ఎంపీలందరికీ హిందీ చక్కగా వచ్చు’’ అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలు, పార్టీ పరంగా ఎవరి వాదన వారికి ఉన్న జాతీయ భాష విషయంలో వెటకార ధోరణి మంచిది కాదంటున్నారు. ఇదే సమయంలో దానికే నేను శూద్రున్ని బ్రాహ్మిణ్‌ అయిన నిర్మల హేళన చేసిందీ అని రేవంత్‌ చిన్నబుచ్చుకోవడం కూడా సరికాదన్న వాదన వినిపిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version