Inter Student Sabitha Drives Auto : కాస్తంత కష్టం కలిగితే చాలు తమ జీవితం ఇక ముగిసిందన్నంతగా బాధపడుతున్నారు నేటి యువత. తమకు తప్ప ఈ భూమ్మీద ఇంకెవరికీ కష్టాలు లేవన్నంతగా మథనపడుతుంటారు. ముఖ్యంగా చదువుకోవాలని అనుకున్నవారికి అనేక కష్టాలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో చాలా మంది తమ చదువును మధ్యలోనే ఆపేస్తారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పేదరికంలో ఉండే అమ్మాయిలు చదువుకోవడానికి అన్నీ అడ్డంకులే ఏర్పడుతాయి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అడపిల్లే బరువనుకుంటారు.. అందులోనూ ఆమెకు చదువా..? అన్న మనస్తత్వంతో ఉంటారు. అయితే తాను, తన చదువు తల్లిదండ్రులకు భారం కాకుడది ఆలోచించిన ఓ యువతి స్వయం ఉపాధికి సంచలన దారిని ఎంచుకుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు ఆటో నడుపుతూ తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది.
కాలేజీకి వెళ్లే అమ్మాయిలు నడుచుకుంటూ లేదా స్కూటీలపై వస్తుంటారు. కానీ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సబిత మాత్రం ఆటో నడుపుకుంటూ కళాశాలకు వస్తుంది. ఈమె ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీ సమయం పూర్తికాగానే ఇదే ఆటోలో ప్రయాణికులను చేరవేరుస్తుంది. మగవారితో సమానంగా ఆమె ఆటో నడపడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సబిత నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆయన తండ్రి నర్సయ్య ఓ హోటల్లో పనిచేస్తూ 2015లో అనారోగ్యంతో చనిపోయారు. ఆ తరువాత వీరికి పూటగడవడం కష్టంగా మారింది. తల్లి రమణమ్మ హోటల్లో పనిచేస్తూ తన కూతురిని పదో తరగతి వరకు చదివించింది. పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో నకిరేకల్ లోని ప్రభుత్వ కాలేజీలో బైపీసీ చదువుతోంది. కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న సబిత కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుంది. హోటల్ యజమాని సాయంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న సబిత ఆ తరువాత సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకొని నడుపుతోంది.
ఆమె సొంత గ్రామానికి చదవే కాలేజీ మధ్య 21 కిలోమీటర్లు. దీంతో ఉదయమే ప్రయాణికులు తీసుకొని నకిరేకల్ కు వెళ్తుంది. అక్కడ కళాశాల ఆవరణలో ఆటోను నిలిపి ఆ తరువాత కళాశాల తరగతులకు హాజరవుతుంది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ప్రయాణికులను ఎక్కించుకొని వస్తుంది. ఇక సెలవు రోజుల్లో ఫుల్ టైం ఆటో నడుతుపుతుంది. ఆటో నడపగా వచ్చిన డబ్బును తన ఖర్చులకు పోను మిగిలినవి తన అమ్మకు ఇస్తుంది. ఆటో ఖర్చులకు పోగా రోజుకు 200 మిగులుతాయని చెబుతుంది సబిత.
Also Read: Viral: లేటు వయసు.. ఘాటు ప్రేమ
ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ ‘ఆడపిల్ల అని చులకనగా చూస్తుంటారు. అలాంటి వాళ్ల నోళ్లు మూయించాలనే నేను నాకాళ్లపై నిలబడి ముందుకు పోతున్నాను. నేను ఆటో నడపడం వల్ల మా అమ్మపై ఆధారపడకుండా నా ఖర్చులకు నేనే సంపాదించుకుంటున్నాను.’ అని చెప్పింది. ఇక ఆత్మరక్షణ కోసం సబిత కరాటేలో శిక్షణ తీసుకుంటోంది. అమ్మాయిల్లో మనోధైర్యాన్ని నింపేందుకే నేను ఆటో నడపాలని అనుకున్నానని అంటోంది.
సబిత ఆరోతరగతిలో ఉండగానే తండ్రి మరణించాడు. ఆ తరువాత ఎన్నో కష్టాలు పడి 10వ తరగతి వరకు పూర్తి చేసింది. అయితే ఆమె యాక్టివ్ నెస్ చూసి హోటల్ యజమాని తనకు ఏదో ఒక ఉపాధి చూపించాలనుకున్నాడు. ఆటో నడుపుతానని సబిత చెప్పడంతో ఆశ్చర్యమేసినా.. ఆమె కోరిక మేరకు ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆటోనే సబితకు జీవనోపాధితో పాటు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు ఆటో నడుపుతోంది సబిత. చదువులోనూ రాణిస్తున్న సబిత ఉన్నత శిఖరాలకు చేరాలని గ్రామస్థులు, లెక్చరర్లు కోరుకుంటున్నారు.
Also Read: Idea: ఒక్క ఐడియాతో నెలకు కోటి సంపాదిస్తున్న యువతి..!