Hindupuram: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక మహిళను, ఆటో డ్రైవర్ ను అర గుండు కొట్టించారు. చెప్పుల దండతో ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన హిందూపురంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
హిందూపురంలో నివాసం ఉంటున్న వివాహితకు పరిగి మండలం ఊటకూర కు చెందిన ఆటో డ్రైవర్ హుస్సేన్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో సన్నిహితంగా ఉండేవారు. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆటో డ్రైవర్ భార్య, ఆమె బంధువులు పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది . ఈ నేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం ఉదయం ఓ ఇంట్లో వారు ఉండగా ఆటో డ్రైవర్ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీంతోఆటో డ్రైవర్ భార్య బంధువులు 20 మంది వరకు వచ్చారు. ఆ వివాహితతో పాటు కుమారుడ్ని ఆటోలో ఎక్కించుకొని ఆటో డ్రైవర్ భార్య పుట్టినిల్లు అయిన తిలక్ నగర్ కు తీసుకెళ్లారు. ఆ ఆటో డ్రైవర్ను సైతం అక్కడికి తీసుకొచ్చారు. కొడుకు కళ్లెదుటే ఆ మహిళను దారుణంగా కొట్టారు. చేతులను తాళ్లతో కట్టేసి అర గుండు చేశారు. ఆటో డ్రైవర్ ను సైతం అరగుండు కొట్టించారు. అనంతరం ఇద్దరి చేతులను ఒకే తాడుతో కట్టి, మెడలో చెప్పుల దండ వేసి తిలక్ నగర్ వీధుల్లో ఊరేగించారు.
ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. కానీ సదరు వివాహితను మాత్రం విడిచిపెట్టలేదు. ఆమెను ఆటో డ్రైవర్ స్వగ్రామం ఊటకూరు తీసుకెళ్లి ఊరేగించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.