India vs Bangladesh 1st Test 2022: వన్డే సిరీస్ లో జరిగిన పొరపాటుకు టీమిండియా సర్దుకుంది. బంగ్లాదేశ్ తో సిరీస్ కోల్పోవడంతో కనువిప్పు కలిగింది. చివరకు తేరుకున్నారు. బంగ్లాదేశ్ తో ఓటమి అంటే అందరు నవ్వుకున్నారు. టీమిండియా పరిస్థితికి జాలిపడ్డారు. ఏమరుపాటుకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. అదే తప్పును టెస్ట్ మ్యాచుల్లో కూడా చేస్తే ఫలితం దారుణంగా ఉండేది. దీంతో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం చాటుతోంది. రెండో రోజు బంగ్లాను పరిమిత స్కోరుకే కట్టడి చేసి ఆలౌట్ చేయడంతో ప్రత్యర్థి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ విజృంభణతో బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 271 పరుగులు వెనుకబడి ఉంది. వన్డేల్లో టీమిండియాను ముప్పతిప్పలు పెట్టిన మెహిదీ హసన్ మిరాజ్ టెస్ట్ లో ఇబ్బంది పడ్డాడు. దీంతో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. వన్డేల్లో పోయిన పరువును టెస్టుల్లో పోకుండా చూసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
బంగ్లా ఇన్నింగ్స్ లో తొలి బంతికే ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ షాంటోను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో బంగ్లా పతనం ప్రారంభమైంది. తరువాత 17 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన యాసిర్ ఆలీని ఉమేష్ యాదవ్ ఔట్ చేశాడు. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. 30 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన లిటన్ దాస్ ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. అలా బంగ్లాదేశ్ వికెట్లు పోవడంతో బంగ్లా పతనం అంచుల్లోకి వెళ్లింది.

45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన మరో ఓపెనర్ జాకీర్ హుస్సేన్ ను సిరాజ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. 25 బంతుల్లో 3 పరుగులు చేసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఇంకా 22 బంతుల్లో 16 పరుగులు చేసిన నురుల్ హసన్ ను సైతం కుల్దీప్ పెవిలియన్ కు చేర్చాడు. పది ఓవర్లలో మూడు మెయిడిన్ వేసి నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్, మూడు వికెట్లు తీసిన సిరాజ్ మొత్తం ఆట స్వరూపాన్నే మార్చేశారు. బంగ్లా ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు.
రెండో రోజు ఆటలో టీమిండియా తన సత్తా చాటింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ చేసిన టీమిండియా 126 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 86, చతేశ్వర్ పూజారా 90 పరుగులు చేసి ఇన్నింగ్స్ లో టాప్ గా నిలిచాడు. దీంతో టీమిండియా విసిరిన సవాలును బంగ్లా చేధించడం కష్టమే. దీంతో మొదటి టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి ఖాయమే అని తెలుస్తోంది. మొత్తానికి టీమిండియా వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోనుందని విశ్లేషకులు చెబుతున్నారు.