Buffalo Dung: ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మృత్యువు ఏ రూపంలో కబళిస్తుందో కూడా చెప్పలేం. ఓ ఆరు నెలల చిన్నారి విషాదాంతం చూస్తే ఇది నిజమని తేలుతుంది. ఓ గేదె ముఖంపై పేడ వేయడంతో ఊపిరాడక ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. ఆరు నెలలకే నూరేళ్లు నిండిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల వ్యధ అంతా కాదు. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్వాలి కుల్పహార్ లోని సతారీ గ్రామంలో అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి మృత్యువాత పడ్డాడు. ముఖేష్ యాదవ్, నిఖిత దంపతులకు ఆయుష్ అనే ఆరు నెలల చిన్నారి ఉన్నాడు. వారికి పాడి పశువులు ఉన్నాయి. దీంతో బుధవారం సాయంత్రం నిఖిత పశువులకు గడ్డి వేసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో చిన్నారి ఆయుష్ ఏడ్చాడు. దీంతో తల్లి ఆయుష్ ను పశువుశాలకు తీసుకెళ్లి అక్కడే ఉన్న ఉయ్యాలలో వేసింది. పడుకోబెట్టింది. ఏడుపు మానేసి నిద్రపోతున్న చిన్నారిని అలా వదిలేసి ఇంట్లో పని చేసుకోవడంలో నిమగ్నమైంది.
అయితే ఉయ్యాలలో నిద్రపోతున్న ఆయుష్ ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో చిన్నారి బాలుడు ఊపిరి ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి నిఖిత ఉయ్యాల వద్దకు వెళ్లి చూసేసరికి చిన్నారి ముఖం పై పేడ పడి ఉంది. అప్పటికే ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.