Boys Marriage: ప్రపంచం టెక్నాలజీతో నిండిపోతోంది. ఏ చిన్న పనినైనా టెక్నాలజీనే ఉపయోగించి చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో కూడా కొన్ని మారుమూల గ్రామాలు అభివృద్ధి సాధించడం లేదు. పురాతన కాలంలో పెట్టిన సాంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తున్నారు. కొన్ని పనులు, అవసరాల కోసం చాలా మంది ఈజీగా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నా.. మారుమూల గ్రామాల్లోని వారు మాత్రం మూఢాచారాలను పాటిస్తున్నారు. తాజాగా వర్షాలు కురవాలని ఓ గ్రామంలో వింత కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.
వర్షకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఇంకా వానలు పడడం లేదు. ఈ పరిస్థితి సౌత్ లోని చాలా రాష్ట్రాల్లో ఉంది. అందులో కర్ణాటక ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో రైతులు వర్షం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. సాధారణంగా మేఘాలు ఉండి వర్షాలు కురవకపోతే మేఘమథనం నిర్వహిస్తారు. లేదా దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి ఆరాధిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా చేయలేదు.
కర్ణాటక రాష్ట్రంలోని మండ జిల్లా గంగినహళ్లి అనే గ్రామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్రామంలో వర్షాలు కురవాలని పెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకబ్బాయిని పెళ్లికూతురుగా తయారు చేశారు. సాధారణ పెళ్లి లాగే వీరికి వివాహం జరిపించి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల వర్షం కురుస్తుందని ఇక్కడి వారు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు.
సాధారణంగా వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం.. కానీ ఇలా ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవే కాకుంగా చాలా గ్రామాల్లో వర్షం కోసం వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అయితే ఒక పెద్ద బండపై పాలుపోసి నాలుకతో అద్దుతారు. మరికొందరు రెండు కప్పలను ఒక కర్రకు కట్టి ఊరంతా తిప్పుతూ వర్షం కురవాలని వేడుకుంటారు.