
TSPSC Paper Leak Praveen: ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు విస్తు గొలిపే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లలో 60 జీబీ సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా ఏఈ ప్రశ్న పత్రం మాత్రమే లీక్ అయిందని అనుకున్న అధికారులు.. ఇప్పుడు మరికొన్ని ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయ్యాయని చెప్తున్నారు. ప్రవీణ్ నుంచి సేకరించిన పెన్ డ్రైవ్లలో తొలగించిన సమాచారాన్ని కూడా తిరిగి రాబట్టడంలో సిట్ అధికారులు దృష్టి సారించారు. ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు,సెల్ ఫోన్ లను ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ కి పంపిన ప్రత్యేక దర్యాప్తు అధికారులు.. అందులోని ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇప్పటికే కొంత అంచనాకు వచ్చారు.
ఇప్పటివరకు ఏఈ సివిల్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ప్రశ్నపత్రాలు మాత్రమే లీకైనట్టు వెల్లడి కాగా, వెటర్నరీ అసిస్టెంట్, ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రశ్నపత్రాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచే లీక్ అయినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ పెన్ డ్రైవ్లలో వాటి సమాచారం ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్న పత్రాలు, కీ లు, సమాధానాలతో కూడిన సమాచారంతోపాటు భవిష్యత్తులో జరగాల్సిన ప్రశ్నపత్రాల ఫోల్డర్లనూ ప్రవీణ్ తస్కరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతను తస్కరించిన ప్రశ్న పత్రాలు ఎన్ని అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల భవితవ్యాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిర్దేశించనున్నదని తెలుస్తోంది. లక్షల మంది భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ కేసులో సిట్ ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఈ కేసులో ప్రవీణ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక సహాయ 9 మంది నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాల్లోని వాస్తవాలను ధ్రువీకరించుకోవమూ సిట్ కు సవాల్ గా మారింది. ప్రశ్న పత్రాలు విక్రయించడం ద్వారా సమకూరిన డబ్బులో 3.5 లక్షలను తన బంధువుకిచ్చినట్టు ప్రవీణ్ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. అయితే ఆ బంధువును పిలిపించిన పోలీసులు విచారించడంతో ప్రవీణ్ చెప్పింది అవాస్తవమని తేలింది.ఈ నేపథ్యంలో అతడి వాంగ్మూలంలో నిజాలను మరోసారి నిర్ధారించుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న అనంతరం వాస్తవాలను రాబట్టాలని యోచిస్తున్నారు.
ప్రవీణ్ ఫోన్లో సేకరించిన కాంటాక్ట్ ల విచారించడం సిట్ అధికారులకు కీలకంగా మారింది. అతడి ఫోన్ కాంటాక్టుల జాబితాలో 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో పలువురు ఏ అతడి తో చాటింగ్ చేసినట్టు సమాచారం. ఇక లీకేజీ కి సంబంధించిన సమాచారాన్ని రాబట్టడంలో సదరు యువతుల వాంగ్మూలం కీలకం కానుంది.
ఇక లీకేజీ వ్యవహారాన్ని తేల్చేందుకు పలువురు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బందిని సిట్ విచారించింది. కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్ వ్యవహార శైలి గురించి విచారించింది. హైదరాబాద్ నగరంలోని కొన్ని కోచింగ్ సెంటర్లలోనూ ఆరా తీసింది. అయితే ప్రవీణ్, రాజ శేఖర్ ప్రశ్నపత్రాలను అమ్మేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది..
ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్, మే నెలలో నిర్వహించే పరీక్షలు రీ షెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నపత్రల లీకేజీకి పాల్పడిన నిందితుడి వద్ద త్వరలో నిర్వహించాల్సిన పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్న పత్రాలు స్థానంలో కొత్తవి సిద్ధం చేయనున్నట్టు రెండు రోజుల క్రితమే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. కొత్త ప్రశ్న పత్రాలను సిద్ధం చేసేందుకు, ప్రింట్ చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొమ్మిది రకాల పోస్టుల పరీక్షలు రీ షెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.