
Lorry Drivers Robbery: చెమట చుక్క చిందించకుండా, ఒళ్ళును ఏమాత్రం కష్టపెట్టకుండా పైసలు సంపాదించాలనే యావ లో మనుషుల్లో నానాటికి పెరిగిపోతున్నది. అలా తేరగా సంపాదించిన డబ్బుతో జల్సాలకు, విలాసాలకు ఖర్చు చేయడం పరిపాటిగా మారుతున్నది. నిన్నా మొన్నటి వరకు ఇలాంటి వ్యవహారాలలో పురుషుల పేరే ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆస్థానాన్ని మహిళలు ఆక్రమిస్తున్నారు. అంతేకాదు డబ్బులు సంపాదించేందుకు దౌర్జన్యాలు కూడా వెనుకాడటం లేదు.
చూసేందుకు వారు అమాయకుల్లాగా కనిపిస్తారు. కసి రేకెత్తించే చూపులతో పురుష పుంగవులకు వలవిసురుతారు. మగవాళ్ళు తమ ఏకాగ్రత్త కోల్పోయేలా దుస్తులు ధరిస్తారు. కొంటె సైగలు చేస్తారు. తీరా వారి దగ్గరికి వెళ్లిన తర్వాత అసలు విశ్వరూపం చూపిస్తారు. ఇక తరిచి చూసుకునేందుకు ఏమీ ఉండదు. క్షణాల్లో మొత్తం ఊడ్చేస్తారు. ఏం జరిగిందో తేరుకునే లోపే అక్కడి నుంచి నిమిషాల్లో ఉడాయిస్తారు.
ఆ మధ్య ఖాకీ అనే పేరుతో తమిళ హీరో కార్తీ సినిమా ఒకటి విడుదలైంది.. గుర్తుంది కదా! అందులో రాజస్థాన్ ముఠా డబ్బులు తస్కరించేందుకు ఎంతకైనా దిగజారుతుంది. ఎలాంటి దౌర్జన్యాలు చేసేందుకైనా వెనుకాడదు. మనుషుల ప్రాణాలు మంచినీళ్లు తాగినంత ఈజీగా తీసేస్తుంది. అలాంటి ముఠానే ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో సంచరిస్తోంది.. కాకపోతే ఈ ముఠాలో సభ్యులు మొత్తం ఆడవాళ్లే.. చూసేందుకు ఎర్రగా బుర్రగా కనిపిస్తారు.. లారీ డ్రైవర్లనే లక్ష్యంగా చేసుకొని కొంటె సైగలు చేస్తారు.. వలపు బాణాలు విసురుతారు. ఇంటికి దూరంగా రోజుల తరబడి ఉండటం, పైగా ఆడవాళ్ళే రెచ్చగొట్టి పిలుస్తుండడంతో లారీ డ్రైవర్లు నేరుగా వారి దగ్గరికి వెళ్తుంటారు. ఇలాంటప్పుడే ఆడవాళ్ళ ముఠా అసలైన ప్లాన్ కు తెరతీస్తోంది. ఎప్పుడైతే లారీ డ్రైవర్లు తమ వద్దకు వస్తారో మాటల్లో పెట్టి, కళ్ళల్లో కారం కొడతారు. వారి వద్ద మొత్తం ఉన్నది లాగేసుకొని క్షణాల్లో మాయమవుతారు.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి వస్తున్న ఓ లారీని ఇద్దరు మహిళలు ఆపారు. తాము హైదరాబాద్ వెళ్లాలంటూ అందులో ఎక్కారు. డ్రైవర్ ను మాటల్లో పెట్టారు. అతని కళ్ళల్లో కారం కొట్టి 25,000, మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదంతా గమనిస్తున్న సమీపంలోని వారంతా ఆ మహిళలను పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు.. స్థానికంగా పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తాలూకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ సమయంలోనే హైవేల మీద వెళ్తున్న లారీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు కొంతమంది మహిళలు ఇలా ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఈ తరహా సంఘటనలు పెరగడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు వివరిస్తున్నారు.