Madhya Pradesh: చదువు రాకముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నాట్ట. ఆధునిక కాలంలో వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని వ్యాధులకు చికిత్స దొరుకుతోంది. దీంతో ఎంత పెద్ద రోగమైనా తగ్గేందుకు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. నేటి కాలంలో కూడా పురాతన కాలంలో వాడే పద్ధతులు వాడి వైద్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. తలకు గాయం కావడంతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు కండోమ్ తో కట్టుకట్టడం వివాదాలకు కేంద్రమైంది. రోగం కుదిరింది రోకలి తలకు కట్టు కట్టండి అన్నట్లుగా వైద్యుల పరిస్థితి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మధ్యప్రదేశ్ లోని మురేనా జిల్లాలోని ధరమ్ గఢ్ గ్రామంలోని ఓ 70 ఏళ్ల వృద్ధురాలు తలకు అకస్మాత్తుగా గాయమైంది. దీంతో రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను పోర్సాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడున్న వైద్యులు ఆమె తలకు కండోమ్ తో కట్టుకట్టారు. అయినా రక్తం కారడం ఆగలేదు. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె తలకు ఉన్న కండోమ్ కట్టును చూసి ఆశ్చర్యపోయారు. రక్తస్రావంత తగ్గేందుకు కండోమ్ తో కట్టు కట్టడమేంటో వారికి అర్థం కాలేదు.
విషయం తెలియడంతో అందరు అవాక్కయ్యారు. దీంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పందించారు. విచారణకు ఆదేశించారు. బాధిత మహిళ రేష్మాబాయి తలకు కట్టు కట్టిన సంఘటనపై ఆరా తీశారు. ఆ రోజు విధుల్లో ఉన్న డాక్టర్ ధర్మేంద్ర రాజ్ పుత్, వార్డు బాయ్ లపై చర్యలకు ఉపక్రమించారు. మహిళకు కండోమ్ తో కట్టుకట్టడంపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే విధంగా వ్యవహరించిన వైద్యుల తీరుపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.

సాధారణంగా తలకు గాయమైతే బ్యాండేజ్ తో కట్టుకట్టడం తెలిసిందే. కానీ వారు రొటీన్ కు భిన్నంగా కండోమ్ కవర్ తో తలకు కట్టు కట్టడం ఆందోళనకు గురిచేసింది. వృద్ధురాలని చూడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కండోమ్ తో గాయానికి కట్టుకట్టి వివాదాలకు కారణమయ్యారు. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు వైద్యాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వివాదాస్పదంగా వ్యవహరించిన సిబ్బంది విషయమై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.