Food Stall Saikumari: ఓ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఇప్పటికే 10 లక్షలు వ్యూస్ వచ్చాయి. మరో ఛానల్ ఆమె వంటల గురించి వీడియో తీస్తే ఏకంగా యూట్యూబ్లో సంచలన నమోదయింది. ఆ వీడియో ఇప్పుడు ఏకంగా ఈ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. అలాగని ఆమెమీ సెలబ్రిటీ కాదు. ఒక మామూలు దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గృహిణి. అలాంటి మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనం .. ఆమె మాట వినిపిస్తే చాలు యూట్యూబర్లకు ఒక పర్వదినం. ఆమె వంట తినేవాళ్ళకు రోజు ఒక పండగ దినం..
మాదాపూర్ లో అది కూడా ఐటీ కంపెనీలు అధికంగా ఉండే ప్రాంతంలో కుమారి ఆంటీ హోటల్ ఎక్కడా అంటే ఎవరైనా చెప్తారు.. హోటల్ అంటే అదేం పెద్ద హంగూ ఆర్భాటం ఉండదు. జస్ట్ ఒక డేరా వేసుకుని దానికింద కుమారి ఆంటీ, ఇంకా కొంతమంది కలిసి వెజ్, నాన్ వెజ్ ఫుడ్ అమ్ముతుంటారు. చికెన్, చికెన్ ఫ్రై, మటన్, మటన్ ఫ్రై, ఫిష్, తలకాయ కూర, బోటీ, రొయ్యల కూర, సాంబార్, పప్పు, రసం, ఆలుగడ్డ ఫ్రై, టమాట చెట్నీ, దొండకాయ చట్నీ, టమాటా రైస్, బగారా అన్నం, మామూలు అన్నం.. ఇలా ఉంటుంది కుమారి ఆంటీ హోటల్ దగ్గర మెనూ. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె తన ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. సాయంత్రం నాలుగు గంటల దాకా అక్కడొక జాతరను తలపించే విధంగా ఉంటుంది. వాళ్లు వీళ్ళు అని కాదు చాలామంది అక్కకు వచ్చి కడుపునిండా భోజనం చేసి వెళ్తారు. కొంతమంది రేట్లు ఎక్కువ ఉన్నాయని వాపోతారు. ఇంకొంతమంది ఈ రోజుల్లో ఇలా రేట్లు లేకపోతే ఎలా గిట్టుబాటు అవుతాయని అంటుంటారు.
కుమారి ఆంటీ ఫుడ్ గురించి చాలామంది యూట్యూబర్లు రకరకాలుగా వీడియోలు తీశారు. సోషల్ మీడియా అనేది బలంగా ఉన్న ఈ రోజుల్లో యూట్యూబర్ల వీడియో ద్వారా కుమారి అంటి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. యూట్యూబర్ల పుణ్యమా అని ఆమె వద్దకు రోజు వందల మంది భోజనం చేయడానికి వస్తున్నారు. అయితే ఇంతటి ఆమెకు ఒక్క రోజులో రాలేదు. రోజు రకరకాల మాంసాహార వంటలు ఉండే కుమారి అసలు మాంసాహారమే ముట్టదు. ఆమెకు పెళ్లయ్యేంతవరకు నాన్ వెజ్ వంట ఎలా చేస్తారో కూడా తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో పెళ్లయిన కొత్తలో ఆమె సింగర్ హేమచంద్ర వాళ్ళింట్లో వంట మనిషిగా పనిచేసింది. అప్పట్లో వాళ్ల బంధువులు వంట చేస్తున్నావా అని హేళన వంటింటి కుందేలు అని ఆట పట్టించే వాళ్ళు. అయినప్పటికీ కుమారి ఆంటీ వెనకడుగు వేయలేదు. హేమచంద్ర ఇంట్లో వాళ్ళ అమ్మగారు నేర్పిన వంట మెలకువలు నేర్చుకుంది. తర్వాత కొంతకాలానికి వాళ్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత భర్తతో కలిసి చిన్న పార్టీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అది అంచులంచలుగా ఎదిగింది. మాదాపూర్ ప్రాంతంలో కుమారి ఆంటీ అనే బ్రాండ్ స్థిరపడిపోయింది.
తన ఇంటినే కుమారి అంటీ కిచెన్ గా మార్చుకుంది. ఇద్దరు వంట సహాయకులను పెట్టుకుంది. వారికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చింది. తనకున్న ఆస్తమా కారణంగా రోజు ఉదయం కుమారి ఆంటీ 7 గంటలకు లేస్తుంది. కానీ అంతకుముందే ఆమె భర్త లేస్తాడు. ఆమె లేచే వరకు దాదాపు వెజ్ వంటకాలు మొత్తం పూర్తి చేస్తాడు. ఇక కుమారి ఆంటీ లేచిన తర్వాత నాన్ వెజ్ వండటం మొదలు పెడుతుంది. రోజు తక్కువలో తక్కువ క్వింటా వరకు చికెన్ వండుతుంది. ఇందులో 80 కిలోలు కూర అయితే, మిగతాది ఫ్రై చేస్తుంది. తలకాయ కూర ఆరు కిలోలు, మటన్ దాదాపు 8 కిలోలు, బోటి నాలుగు కిలోలు, చాపలు 15 కిలోలు, రొయ్యలు 8 కిలోలు వరకు వండుతుంది. ఇక బియ్యం రోజుకు క్వింటాన్నర దాకా.. పడతాయని కుమారి చెబుతోంది. తన ఇంటినే కిచెన్ గా మార్చుకుని.. ఎటువంటి అండదండలు లేకుండా కుమారి ఆంటీ అనే బ్రాండ్ పేరును సృష్టించింది అంటే మామూలు విషయం కాదు. మహిళలను చాలామంది వంటింటి కుందేలు అంటూ హేళన చేస్తుంటారు. కానీ ఆ వంట ద్వారానే కుమారి ఆంటీ ఫేమస్ అయింది. నాలుగైదు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక అమ్మలాగా రోజుకు వందలాది మంది కడుపు నింపుతోంది. సరే ఇక్కడి వంటలు కొంతమందికి నచ్చవచ్చు.. కొంతమందికి నచ్చకపోవచ్చు.. ఇప్పుడున్న రేట్లలో ఆ స్థాయిలో మెనూ పెడుతూ ఇంతమంది కడుపు నింపుతోంది అంటే మామూలు విషయం కాదు.