Odisha Husband Wife: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని చోట్ల కట్టుకున్న వారినే కడతేర్చుతుండగా మరికొన్ని చోట్ల జీవిత భాగస్వామి చేసిన పనికి తామే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భార్య దేన్నయినా సహిస్తుంది కానీ అక్రమ సంబంధాలను మాత్రం క్షమించదు. తన భర్త తనకే సొంతం అనుకుంటుంది. అలాగే భర్త కూడా తన భార్య తనకే కావాలని పట్టుపడుతుంటాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు మనుషుల బుద్ధులు మారుతున్నాయి. దీంతో బతుకులు కూడా బుగ్గిపాలు అవుతున్నాయి.

ఒడిశాలోని కలహండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయి పిల్లలున్న వ్యక్తి ఓ హిజ్రాతో ప్రేమాయణం కొనసాగించాడు. ఇదేం వింత అని అందరు అనుకున్నా అతడు మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఆమెతోనే చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. విషయం కాస్త భార్యకు తెలియడంతో షాక్ కు గురైంది. తన భర్త ఇలాంటి పని చేస్తున్నాడని తెలుసుకుని అవాక్కయింది. హిజ్రాలో ఏం నచ్చిందో కానీ అతడు ఆమెతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. ఎందరు ఎంతలా దెప్పినా వినకుండా హిజ్రాతో కలిసి తిరగడం మాత్రం మానలేదు.
భర్త అభిరుచి తెలుసుకున్న భార్య తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హిజ్రాతో ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకుంది. భర్త ఇష్టాన్ని గౌరవించింది. జీవితభాగస్వామిని హిజ్రాతో వివాహం చేయించింది. దీంతో ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. భర్తతో దేవాలయంలో ఇద్దరికి వివాహం చేయడంతో ఇక కలిసి కాపురం చేసే అవకాశం ఇచ్చింది. దీనిపై హిజ్రా కూడా స్పందిస్తూ తనకు సంతోషంగా ఉందని, తనను కూడా ఓ ఆడదానిగా గుర్తించి ఆమె చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తోంది.

తన భర్త ఫకీరు చేసిన పనికి ఆమెలో కోపం మాత్రం రాలేదు. ఆయన మనసు పడ్డ హిజ్రాను చేరదీసి పెళ్లి చేయడంలో ఆంతర్యమేమిటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు దగ్గరకు వస్తేనే అసహ్యించుకునే మహిళ ఆమెతోనే పెళ్లి చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ నేపథ్యంలో తన భార్య సహకారంతో తాను హిజ్రాను పెళ్లి చేసుకుని సంతోషంగా గడపనున్నట్లు ఫకీరు చెబుతున్నాడు. మొత్తానికి ఈ ఘటన అందరిలో ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. అతడి భార్య చేసిన పని వైరల్ గా మారుతోంది.