
YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చురుగ్గా సాగుతోంది. విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే కేసులో ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారందరూ రిమాండ్లో ఉన్నారు. తొలుత ఏపీ కోర్టు పరిధిలో సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. వివేకా కుమార్తె సునీత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తెలంగాణకు బదిలీ చేశారు. అప్పటి నుంచి సీబీఐ శరవేగంగా పావులు కదుపుతోంది. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి సైతం నోటీసులందుకున్నారు. దీంతో ఆ కుటుంబం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇటువంటి తరుణంలో అవినాష్ రెడ్డికి ఊరటనిస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఊరటనిచ్చింది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో జరిగిన ఓ ధర్నాలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలతో పాటు హాజరయ్యారు. వివిధ అభియోగాలు మోపుతూ అప్పట్లో పోలీస్ కేసు కేసు నమోదైంది. అప్పటి నుంచి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులోవిచారణ కొనసాగుతోంది. ఇంతలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో కేసు విచారణ జాబితా నుంచి వివేకా పేరును తొలగించారు. అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డిలు మాత్రం విచారణకు హాజరవుతూ వస్తున్నారు. కానీ వారిద్దరికి ఊరటనిస్తూ కోర్టులో తీర్పు వచ్చింది. పోలీసులు నేరారోపణ రుజువు చేయకపోవడంతో కోర్టు వారి పేర్లను సైతం తొలగించింది.

వివేకానందరెడ్డికి ఫాలోవర్స్ గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉండేవారు. అటు అవినాష్ రెడ్డి సైతం రాజకీయంగా ఎదగాలని భావిస్తున్న రోజులవి. 2015లోటీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడపలో వైసీపీ యాక్టివిటీస్ అన్ని వివేకానందరెడ్డి చూసే వారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరాటం చేసింది నాటి కార్యక్రమంలో వివేకానందరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. కడపలో ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారంటూ తొండూరు పీఎస్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి వివేకానందరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి విచారణకు హాజరవుతూ వస్తున్నారు. వివేకా హత్య కాక మునుపు వరకూ విచారణకు విజయవాడ కోర్టుకు వచ్చేవారు. మొన్నటివరకూ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యేవారు. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి వివేకా హత్య కేసులో అరెస్టయ్యారు. ఆయన కూడా జైలు నుంచి విచారణకు వచ్చేవారు. కానీ పోలీసులు నేరాన్ని రుజువు చేయకపోవడంతో ఆ ఇద్దరి పేర్లను న్యాయమూర్తి తొలగిస్తూ తీర్పుచెప్పారు.