
Pawan Kalyan- BJP: జనసేన అధ్యక్షుడు ఢిల్లీ టూర్ ముగిసింది. అయితే పవన్ తనంతట తాను ఢిల్లీ వెళ్లారా?బీజేపీ పెద్దలు చర్చలకు ఆహ్వానించారా? చర్చిస్తే అది పొత్తుల కోసం జరిగిందా? లేకుంటే సొంతంగా ఎదగాలని భావిస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పవన్ ఇదే అఖరు ప్రయత్నమని.. కలిసి వస్తే టీడీపీతో కలిసి వెళదామని ప్రతిపాదన పెట్టారని.. వైసీపీ విముక్త ఏపీకి ఇంతకంటే మార్గం లేదని హైకమాండ్ వద్ద తేల్చేసినట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలు మాత్రం సొంతంగా ఎదిగే ప్రయత్నం చేద్దామని… అదీకాకపోతే బలపడేందుకు ఉన్న మార్గాలను చూద్దామని చెప్పడం ద్వారా పరోక్షంగా పొత్తులకు సై అన్నట్టు సంకేతాలిచ్చారు. అయితే స్ట్రయిట్ గా ఏ అంశంపై స్పష్టత రాలేదు. దీంతో పవన్ ఢిల్లీ టూర్ పై రకరకాలుగా చర్చ సాగుతోంది. విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఉనికి కోసం బీజేపీ ఆరాటం..
అయితే పవన్ కళ్యాణ్ కు బీజేపీ అవసరం ఉందా? లేక బీజేపీకి పవన్ అవసరమా? అన్న చర్చ ఒకటి నడుస్తోంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అటు తరువాత చాలా రాష్ట్రాలను ఆ పార్టీ హస్తగతం చేసుకుంది. సొంతంగా పవర్ లోకి వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరచి ఆధీనంలోకి తెచ్చుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఉనికి చాటుకోవడంలో కూడా ఆ పార్టీ ఇబ్బందిపడుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సొంతం చేసుకుంది. స్థానిక సంస్థలు ఉప ఎన్నికలు ఇలా దేనిని తీసుకున్నా తన ఓటు షేరింగ్ ను మెరుగుపరచుకోలేదు. సీట్లను పొందలేకపోయింది. ఇప్పటికీ కుదురుకోవడానికి ఇబ్బందులు పడుతోంది.
గ్రాఫ్ పెంచుకున్న జనసేన..
జనసేన 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఫస్ట్ టైమ్ 2019 ఎన్నికల్లో వామపక్షాలతో బరిలో దిగింది. ఆరు శాతం ఓటు షేర్ సాధించింది. సీట్లపరంగా ఒక్కస్థానంలో నిలిచింది. అయితే గత నాలుగేళ్లుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు పవన్. దీంతో పార్టీకి ఓటు షేరింగ్ పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ ఓటు శాతం 12కు పైగా పెరిగినట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదని.. వైసీపీ విముక్త ఏపీకి అందరు కలవాలని పవన్ భావిస్తున్నారు. గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కంటే జనసేన మెరుగైన స్థితిలో ఉంది. జనసేనఓటు షేర్ తోనే బీజేపీ గట్టెక్కగలదు, అందుకే బీజేపీ అగ్ర నాయకులు జనసేనను వదులుకునేందుకు ఇష్టపడడం లేదు.
సొంతంగా ఎదగడం సాధ్యమేనా?
అయితే ఏపీలో వైసీపీ, టీడీపీ నాయకత్వాల వ్యవహార శైలి చూసే బీజేపీ పెద్దలు సొంతంగా ఎదగాలని పవన్ కు సూచిస్తున్నారు. విశాఖలో పవన్ ను పిలిచి మరీ ప్రధాని మోదీ ఇదే చెప్పినట్టు తెలిసింది. గుజరాత్ బీజేపీలో కేశూబాయ్ పటేల్, వాఘేలా మధ్య కీచులాట జరిగేది. అది తారాస్థాయికి చేరుకుంది. అప్పటికే నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక పదవిలో ఉండేవారు. అటువంటి సమయంలో బీజేపీ మోదీని దించింది. సీఎంగా నియమించింది. అటు తరువాత భూకంపం వంటి విపత్తుతో పాటు ఎన్నో సంక్షోభాలు మోదీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. సొంత పార్టీ నేతలు సైతం గద్దె దించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాటన్నింటినీ అధిగమించి మోదీ రాజకీయంగా ఎదిగారు. గుజరాత్ ను ఏలారు. ఢిల్లీ పీఠం వైపు వచ్చి దశాబ్ద పాలన పూర్తిచేసుకున్నారు. పవన్ కు అదే విషయాన్ని గుర్తుచేసి టీడీపీ, వైసీపీకి ధీటుగా సొంతంగా ఎదగాలని సలహా ఇచ్చారు.

పవన్ రూట్లోకి రావడం అనివార్యం…
కానీ ఇప్పుడున్న పొలిటికల్ సిట్యువేషన్ లో మోదీ చెప్పిన ఫార్ములా వర్కవుట్ కాదు. ఓట్లు, సీట్లు సాధించిన తరువాతే ఏదైనా సాధ్యమని పవన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే అందర్నీ ఒకేతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ విషయంలో ఎదురవుతున్న పరిణామాలు బీజేపీకి మింగుడుపడడం లేదు, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటైనా రాకుంటే మాత్రం ఆ పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది. అందుకే పవన్ ద్వారా ఓట్లు, సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పవన్ అవసరాన్ని గుర్తెరిగి మరీ బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ రూట్లోకి బీజేపీ రావడం అనివార్యంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.