
AP Alliances: ఏపీలో సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పొత్తులకు టిడిపి – జనసేన సిద్ధమవుతున్నాయి. దాదాపుగా ఈ పొత్తు ఖరారు అయినట్లే చెబుతున్నారు. పొత్తులు పెట్టుకుంటున్న ఈ రెండు పార్టీలు మధ్య ఓటు మార్పిడి ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఓటు షేరింగ్ పూర్తిస్థాయిలో జరిగితేనే ఇరు పార్టీలకి లబ్ధి చేకూరుతుంది అన్నది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.
దేశంలో గాని, రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కూటమి కట్టడం సహజం. ఈ తరహా ఏర్పాటు చేసిన కూటమి విజయాలు సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అనేకచోట్ల కూటమి మధ్య ఓట్లు షేరింగ్ సరిగా జరగక అధికారాన్ని చేజిక్కించుకోలేక బొక్క బోర్లా పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తుకు సిద్ధమవుతున్న టిడిపి – జనసేన మధ్య ఓటు షేరింగ్ ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నత స్థాయిలో నాయకులు మధ్య ఉన్నంత సఖ్యత, సంబంధాలు క్షేత్రస్థాయిలో లేవన్నది అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఒకరకంగా చెప్పాలంటే అనేకచోట్ల టిడిపి – జనసేన నాయకుల మధ్య వైరం కూడా ఉందని చెబుతున్నారు.
తెలంగాణలో కూటమికి కలిసి రాని పొత్తు..
2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. ఎన్నికల ఫలితాల తరువాత ఈ మేరకు జరిగిన సమీక్షలో కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ వాటిల్లిందన్నది ఆ పార్టీ నాయకుల అంచనా. ఈ తరహా పరిస్థితి రాష్ట్రంలోనూ ఉండవచ్చు అన్న భావన జనసేన పార్టీ నాయకుల్లోను వ్యక్తమవుతోంది. అదే సమయంలో జనసేన పార్టీ ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మార్పిడి జరుగుతుంది అన్నది కూడా పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది.
కూటమికి ప్రధాన సమస్యగా ఓటు మార్పిడి..
ఏ కూటమి అయినా విజయం సాధించాలంటే ఉన్నత స్థాయిలో నుంచి కింది స్థాయి వరకు కేడర్ నాయకులు మధ్య సఖ్యత ఉండాలి. తెలుగుదేశం పార్టీ – జనసేన మధ్య ఆ స్థాయిలో సఖ్యత ఉందా అన్నది ఆలోచించాల్సిన అవసరంగా నిపుణులు చెబుతున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరో పార్టీకి ఓటు వేసేందుకు పెద్దగా అంగీకరించదు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 30% మంది మాత్రమే కూటమిలో ఉన్న మరో పార్టీకి ఓటు వేయడానికి సిద్ధపడతారు. తమ కులానికి సంబంధించిన వ్యక్తి మరో పార్టీలో ఉంటే కూటమి అభ్యర్థిని కాదని వారికి ఓటు వేసేందుకు కూడా టిడిపి శ్రేణులు వెనుకాడరు. ఇటువంటి పరిస్థితి అనేకచోట్ల ఉన్నట్లు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేందుకు చాలామంది మనసు అంగీకరించదన్న భావన వ్యక్తం అవుతుంది. కాపు కులానికి చెందిన మెజారిటీ ఓటర్లు తెలుగుదేశం పార్టీ అంటే దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం గట్టిగా నిలబడతారు. టిడిపికి సీట్లు లభించే చోట కాపు కులానికి చెందిన ఓటర్లు ఎంతవరకు టిడిపి అభ్యర్థులకు అండగా ఉంటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. టిడిపి పట్ల ఆ కులంలో ఉన్న వ్యతిరేకత భావమే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.

పెను సమస్యగా మారే అవకాశం..
జనసేన – టిడిపి మధ్య పూర్తిస్థాయిలో ఓట్ల మార్పిడి జరగకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో కూటమికి గట్టి దెబ్బ గానే మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరు పార్టీలకు సంబంధించిన అగ్ర నాయకులు క్షేత్రస్థాయిలో ఓట్ల మార్పిడి జరిగేలా చూడాలని, అప్పుడే ఇరు పార్టీలకు లబ్ధి చేకూరుతుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పొత్తులో భాగంగా ఒక పార్టీకి సీట్లు లభించిన చోట.. ఇంకో పార్టీకి చెందిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందించేలా చూడాల్సిన బాధ్యత ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులపై ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇచ్చినట్టు అయితే అక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థి ఎంతవరకు సహకరిస్తాడు అన్నది కూడా సమస్యగా ఉంది. సదరు అభ్యర్థి రెబల్ గా వేయడమో, వైసీపీకి సహకరించడం చేసినట్లయితే జనసేన పార్టీ అభ్యర్థులు ఓటమికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే టిడిపి కు లభించిన చోట్ల జనసేన ఇలానే చేస్తే.. మొత్తంగా పొత్తు అంతా నిష్ప్రయోజనం అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఓట్ల మార్పిడితోపాటు, అసంతృప్తులను సంతృప్తి పరిచే విధంగా ఇరు పార్టీల అగ్ర నాయకులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.