The Elephant Whisperers : నాటు నాటు ను తట్టుకుని మరీ ఎలిఫెంట్ విష్పరర్స్ ఇప్పుడు మీడియాలో వార్త అయింది. ప్రైమ్ టైం లో కాకున్నా.. మిగతా సమయంలో మీడియా దీని గురించి చెబుతోంది.. డాక్యుమెంటరీలు అంటే మనకున్న చిన్న చూపును పక్కకు తోసేసి, కాసేపు దీని గురించి చెప్పుకోవాలి. ఇదే కమర్షియల్ కల్తీ వీరుడు తీసిన సినిమా కాదు. వందల కోట్లు అడ్డగోలుగా కుమ్మేసి వక్రీకరించిన చరిత్ర కాదు. జస్ట్ ఒక మనిషి, జంతువు మధ్య ఉన్న చరిత్ర. ఇద్దరు ప్రకృతితో పెనవేసుకున్న చరిత్ర. భూమ్మీద ప్రాణులకు ఎలాంటి ఆప్యాయత ఉండాలో చెప్పిన చరిత్ర. అందుకే ఎటువంటి ఏజెన్సీల సహాయం లేకుండానే, ఎటువంటి ప్రచారాలు లేకుండానే ఆస్కార్ దాకా వెళ్ళింది. డాల్బీ థియేటర్లో రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్లి సగర్వంగా ఆస్కార్ అవార్డు స్వీకరించింది. ఇంతటి ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఎలా మొదలైంది? దీని నేపథ్యం ఏంటి? దీన్ని చిత్రీకరించేందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి?
ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు దర్శకుడు కార్తీ, నిర్మించింది గునీత్ మోంగా. అంతేకాదు గునీత్ సినిమాటోగ్రాఫర్ కూడా. ఈ సినిమా షార్ట్ ఫిలిం కం డాక్యుమెంటరీ కావచ్చు. కానీ ఇది సౌత్ ఇండియన్ క్రియేటర్స్ కృషి. ఐదేళ్ల శ్రమ పడ్డారు ఈ సినిమా కోసం. జంతువుకు మధ్య ప్రకృతి ఒడిలో పెరిగిన బంధాన్ని కళ్ళ ముందు ఉంచిన సినిమా. ఇద్దరు ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ చిత్రికరణ మీద ఆసక్తి ఉన్నవాళ్లు తీసిన సినిమా కాబట్టే ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. నిజంగా వాళ్ళు చప్పట్లకు అర్హులు.
ఐదేళ్ల క్రితం ఈ సినిమా దర్శకురాలు కార్తీ ఊటీ వెళ్తోంది. తమిళనాడు సరిహద్దులోని బొమ్మన్ కట్టు నాయకన్ అనే జంతు సంరక్షుడు రోడ్డు పక్కన కనిపించాడు. తనతోపాటు ముద్దుమలై అడవులకు చెందిన రఘు అనే బుల్లి ఏనుగు పిల్లకి స్నానం చేయించేందుకు తీసుకెళ్తున్నాడు. ఆ దృశాన్ని అలా చూస్తూ ఉండిపోయింది కార్తీ. వారిద్దరి మధ్య అనుబంధం ఆమెకు అద్భుతంగా అనిపించింది. ఆ ఏనుగు పిల్లకు తల్లి, తండ్రి, స్నేహితుడు… ఇలా అన్నీ ఆ బొమ్మనే. దీని వెనక గుండెలు పలిగే విషాద కథ ఉంది. ఏనుగు పిల్ల రఘు తల్లి కరెంట్ షాక్ తో మరణించింది. అప్పటికీ రఘు వయసు మూడు నెలలు. ఆ వయసులో రఘు మీద వేట కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఉన్న రఘును అటవీ శాఖ అధికారులు సంరక్షణ బాధ్యతను బొమ్మన్ కు అప్పగించారు. ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో బొమ్మన్ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అప్పటినుంచి రఘుకు అతడే అన్ని అయిపోయాడు.
ఆ అడవుల్లో కట్టు నాయకన్ ఎప్పటినుంచో ఏనుగుల సంరక్షణ చేపడుతోంది. వీళ్లకు కృష్ణ జింకలను ప్రేమించే బీష్నోయ్ తెగ ప్రజలకు దగ్గర సంబంధం ఉంటుంది. అలా ఆ ఏనుగును, బొమ్మన్ చూసిన తర్వాత కార్తీ ఆలోచన విధానం మారిపోయింది. డాక్యుమెంటరీ తీసేందుకు పురికొలిపింది. ఆమె అంత హడావిడిగా తీసి పారేసే రకం కాదు. అలా బొమ్మన్ కుటుంబంతో కలిసిపోయింది. ఆ బంధం పెరిగితే తన సినిమా బాగా వస్తుందని ఆమె ఆశ. అనుకోకుండా వాళ్లతో ఒక చుట్టరికమే ఏర్పడింది ఆమెకు. ఆ డాక్యుమెంటరీ మొత్తం బొమ్మన్, ఆయన భార్య బెల్లీ, రెండు చిన్న ఏనుగులు.. వాళ్ళ మధ్య అనుబంధం గురించి డాక్యుమెంటరీలో తీసింది. ఈ డాక్యుమెంటరీలో ఒక ఏనుగు పేరు రఘు కాగా, ఇంకో ఏనుగు పేరు అమ్ము.
ఇక ఈ డాక్యుమెంటరీ షూటింగ్ లో కార్తీ అనేక సవాళ్ళు ఎదుర్కొంది. నడి అడివిలో షూటింగ్ చేసింది. రెండు ఏనుగు పిల్లలు ఒక్కొక్కటి 150 కిలోల వరకు ఉన్నాయి. అనేక కష్టనష్టాల మధ్య ఇది పూర్తయి ఎందుకు 5 సంవత్సరాలు పట్టింది. బొమ్మన్ కుటుంబంతో అనుబంధం పెంచుకోవడానికి కార్తీ ఏకంగా ఏడాదిన్నర సమయం తీసుకుంది. ఈ ఫిలిం మొత్తం 40 నిమిషాల లోపే. కానీ వీళ్ళ షూటింగ్ 450 గంటల ఫీడ్ వచ్చింది. షూటింగ్ చేస్తున్నప్పుడు పులుల దగ్గర నుంచి గుర్రాల వరకు కనిపించేవి. షూటింగ్ జరుగుతున్నంత సేపు కార్తీ చెప్పులు విప్పి ఉత్తి పాదాలతోనే అడవి మొత్తాన్ని తిరిగేది. ఇలా ఎందుకు చేశారు అని ఒక విలేకరి అడిగితే… ఎందుకో అడవికి నమస్కరించాలి అనిపించింది అని చెప్పింది.
షూటింగ్ సమయంలో కార్తీకి సమీపంలోనే ఓ పులి ఒక జంతువుపై దాడి చేసేది.. ఓ చిరుత ఓ జంతువును పీక్కు తినేది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కార్తి ఆమె బృందం మౌనాన్ని ఆశ్రయించే వాళ్ళు. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే కార్తీ, బెల్లీ పెళ్లి జరిగిపోయింది. అది కూడా షూట్ చేశారు. కార్తీ తండ్రి ఓ ఫోటోగ్రాఫర్. తల్లి జంతు ప్రేమికురాలు. ఆమె నానమ్మ పర్యావరణవేత్త. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఇల్లే ఒక ప్రకృతి. ఆమెకు నడక కన్నా ముందు ప్రకృతిని ప్రేమించడం ఆ కుటుంబం నేర్పింది. అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెను అడవుల్లో తిప్పేవారు. 18 నెలల వయసు ఉన్నప్పుడు కార్తీని క్యాంపింగ్ తీసుకెళ్లారు. కార్తీని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వులో పెంచారు. అంటే చిన్నప్పుడే ఆమె అన్ని రకాల జంతువుల మధ్య పెరిగింది అన్నమాట. వాళ్ల ఇంటి గేటుకు దగ్గరలో కెమెరా ట్రాప్స్ పెట్టారు. చిరుతలు, పులుల కదలికలను ఆ కెమెరాలు బంధించేవి.
ఈ ఫిలిం తీసుకుని కార్తీ అమెరికా వెళ్ళింది. ఆమె డాక్యుమెంటరీ ఫిలిం అందరినీ ఆకర్షించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. దీనికోసం ఆమె అమెరికాలో తిష్ట వేయలేదు. మీడియాను మేనేజ్ చేయలేదు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు రావడం కార్తీకి ఎక్కడా లేని ఉత్సాహాన్ని ఇస్తోంది. తన తదుపరి ప్రాజెక్టుకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అన్నట్టు కార్తీ ప్రస్తుతం పసిఫిక్ నార్త్ వెస్ట్ లోని ఆర్కాస్ మీద, ప్రజలతో వాటి బంధం మీద ఫిలిం తీసే పనిలో ఉంది. ఆ జంతువులు కూడా ఏనుగులాగే తెలివైనవి, అందమైనవి. అన్నట్టు ఎలిఫెంట్ విస్పర్స్ కథలోని రఘు ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. దాన్ని అడవుల్లో వదిలారు. అమ్ము కూడా త్వరలో ప్రకృతి ఒడిలోకి వెళ్లిపోతోంది.