MLA Kotamreddy Sridhar Reddy: ఆ ఎమ్మెల్యే మొదట నుంచి జగన్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు. ప్రతిపక్షంలో పోరాడాడు. ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచాడు. కానీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం లాభం.. పనులు జరగడం లేదంటూ సొంతపార్టీ పైనే నిట్టూర్చాడు. మంత్రులు మారినా.. అధికారుల తీరులో మార్పులేదంటూ విమర్శించాడు. ఇప్పుడు సొంత పార్టీనే తన పై నిఘా పెట్టిందని ఆరోపిస్తున్నాడు. తన ఆరోపణలకు ఆధారాలున్నాయంటున్నాడు. తన ఆరోపణల పై చర్చకు సిద్ధమంటూ అధికార పార్టీకి సవాల్ విసిరాడు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే తెలుగుదేశంతో వెళ్లేందుకు సిద్ధమైనట్టు ప్రకటించాడు. దీంతో వైసీపీ అధిష్టానం కోటంరెడ్డి పై సీరియస్ అయింది. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, ఫోన్ రికార్డింగ్ అని కొందరు మంత్రులు సర్దిచెబుతున్నారు. కానీ కోటంరెడ్డి వినేలా లేరు. దీంతో వైసీపీలోని ఓ వర్గం ఇప్పటికే కోటంరెడ్డి పై ఎదురుదాడికి అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటోంది.
వైసీపీతో కోటంరెడ్డి ఇక కొనసాగే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో వైసీపీ అనుకూల మీడియా ఎదురుదాడి ప్రారంభించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని నెలలుగా టీడీపీతో కుమ్ముక్కు అయ్యారని, కోవర్టు ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ప్రారంభించింది. మంత్రి పదవి రాకపోవడంతోనే కోటంరెడ్డి కోవర్టు ఆపరేషన్ మొదలుపెట్టారని చెబుతోంది. జిల్లాలో సీనియర్లు ఉండటం మూలంగా తనకు మంత్రి పదవి రాదనే నిర్ణయానికి వచ్చారని, అందులో భాగంగానే వైసీపీపై వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తూ వచ్చారని ఆరోపిస్తోంది. గతంలో ఫించన్ల ఏరివేత పై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తోంది.

వైసీపీ అనుకూల వర్గం వ్యాఖ్యల పై కోటంరెడ్డి వర్గం మండిపడుతోంది. ఇన్నాళ్లు వీరవిధేయుడిగా ఉన్న కోటంరెడ్డి ఇప్పుడు కోవర్ట్ రెడ్డి అయ్యారా ? అంటూ ప్రశ్నిస్తోంది. సొంత పార్టీ అధికారంలో పనులు జరగలేదని ప్రశ్నించడం తప్పా ? అని ఎదురుదాడి చేస్తోంది. నెల్లూరులో వైసీపీ పుట్టక ముందే జగన్ వెంట నడిచిన కోటంరెడ్డి.. ఇప్పుడు కోవర్ట్ రెడ్డి అయ్యారా ? అంటూ నిలదీస్తోంది. వైసీపీలో ఎన్ని అవమానాలు జరిగినా చూస్తూ ఊరుకుండాలా అంటోంది. కోవర్ట్ వ్యాఖ్యల పై రాజకీయ విశ్లేషకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు ఒకలా.. వ్యతిరేకించినప్పుడు ఒకలా మాట్లాడటం సరికాదంటున్నారు. కోటంరెడ్డి ఆరోపణలపై ప్రభుత్వం విచారించాలి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిరూపించాలి. అప్పుడే కోటంరెడ్డి పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు జనం నమ్ముతారు.