
Chandrababu- Ramoji Rao: ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు నిన్న రామోజీరావు విచారిస్తున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక ఫోటో చక్కర్లు కొట్టింది… తీవ్ర అస్వస్థతతో రామోజీరావు మంచానికి పరిమితమైనట్టు ఆ ఫోటో ద్వారా తెలుస్తోంది. వెంటనే ఆ ఫోటోను తన ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. ” మాకు అత్యంత ఆప్తులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు అనారోగ్యానికి గురయ్యారు.. వారు త్వరగా కోలుకోవాలని మా కుల దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీంతో రామోజీరావుకు ఏమైంది అనే ఆరా మొదలైంది? ఇవి ఒకప్పటి రోజులు కావు కాబట్టి క్షణాల్లో అంతా పాకిపోయింది.. ఒక సెక్షన్ మీడియా మాత్రం జగన్ తో రామోజీరావు పెట్టుకున్నాడు, దెబ్బకు మంచానికి పరిమితమయ్యాడు అని వ్యాఖ్యానిస్తే.. మరో సెక్షన్ మీడియా మాత్రం ఏపీ సిఐడి అధికారులు ఫోటోలు తీసి బయటకు పంపడం ఎంతవరకు కరెక్ట్ అని రాసుకొచ్చాయి.
ఇదే లెక్కన చంద్రబాబు నాయుడుకి రామోజీరావు బెడ్ మీద పడుకున్న ఫోటోలు ఎవరు ఇచ్చారు? ఆ ఫోటోలతో ట్వీట్ చేయమని ఎవరు చెప్పారు? రామోజీరావు పై ఉన్న గురువింద భక్తిని ప్రదర్శించుకునే క్రమంలో చంద్రబాబు అతి చేశాడా? రామోజీరావు కాంపౌండ్ నుంచి హెచ్చరికలు రావడంతో మళ్లీ ఆ ట్వీట్ తొలగించాడా? అంటే ఇందుకు ఔను అనే సమాధానాలు వస్తున్నాయి.
వాస్తవానికి జగన్ కు సంబంధించి ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా అటు టీడీపీ, ఇటు చంద్రబాబు నాయుడు ఏమాత్రం వదులుకోవడం లేదు. అందులో ఎటువంటి తీవ్రత ఉంది అనేది కూడా చూడటం లేదు. రామోజీరావు అస్వస్థతకు సంబంధించి ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు.. తర్వాత దానిని క్షణాల్లోనే తొలగించాడు. ఇలా ఎందుకు జరిగింది అన్నది పక్కన పెడితే.. సిఐడి అధికారులు విచారణ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. అయితే నిన్న ప్లాన్ ప్రకారమే ఆరోగ్యంతో ఉన్న రామోజీరావు ఫోటోలు బయటకు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల సిఐడి విచారణకు భయపడిపోయి మంచం ఎక్కిన రామోజీరావు అని అర్థం వచ్చేలా చేశారు. ఇదే క్రమంలో రాజగురుపై భక్తిని చాటుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు రామోజీరావు ఫోటోను ట్వీట్ చేయడంతో జగన్ పాచిక పారింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

ఇక రాజ గురువు అనారోగ్యాన్ని సొంతానికి వాడుకునేందుకు బాబు సానుభూతి ప్రయత్నాలు చేశాడు. కానీ రామోజీరావు హరికృష్ణ, తారక రత్న కాడు కదా! రామోజీరావుకు సంబంధించిన ప్రతి విషయం కూడా గోప్యంగా ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ లోని శత్రు దుర్భేద్యమైన ఇంటి మాదిరే రహస్యంగా ఉంటుంది. ఇక్కడ రామోజీరావుకు తెలియనిది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గుర్తించినది ఏమిటంటే, పచ్చ మీడియా విస్మరించింది ఏంటంటే..ఇవి సోషల్ మీడియా కాలపు రోజులు.. అందుకే చంద్రబాబు ట్వీట్ డిలీట్ చేశాడు..