YS Jagan: అన్న జైల్లో ఉన్నప్పుడు ఆమె అన్నీ తానై వ్యవహరించింది. కాలికి బలపం కట్టుకుని తిరిగింది. అన్న వదిలిన బాణం అంటూ ఊరూరా డప్పు వేసింది. అన్న అధికారంలోకి రాగానే పక్కకు నెట్టివేయబడింది. కూరలో కరివేపాకులా మారిపోయింది. పోయిన చోట వెతికితే దొరుకుతుందనేది పెద్దలు సామెత. ఇప్పుడు ప్రత్యర్థులు కూడా అదే చెబుతున్నారు. పోగొట్టుకున్న చోట కాకుండా ఇంకో చోట వెతికితే దొరకదని సలహా ఇస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు ? ఆమె పోగొట్టుకున్నదేంటో చదివేయండి.

వైఎస్ షర్మిల ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక నాయకురాలు. జగన్ జైల్లో ఉన్నప్పుడు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. సీన్ కట్ చేస్తే. షర్మిళ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. అధికారం రాగానే అన్న ఆమెను పక్కనబెట్టారు. దీంతో చేసేదేంలేక.. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసుకుంటున్నారు. అన్యాయం చేసిన అన్నను వదిలి కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల విరుచుకుపడుతోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నారు.
వైఎస్ షర్మిల కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి చెప్పారు. ఆమె వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఆమె అవసరం తెలంగాణ ప్రజలకు లేదని అన్నారు. షర్మిళకు ఏపీలో అన్యాయం జరిగిందని, అక్కడకెళ్లి తన గోడు వెళ్లబోసుకుంటే ఉపయోగం ఉంటుందని సూచించారు. తెలంగాణలో గోడు వెళ్లబోసుకుంటే ఉపయోగం ఉండదని అన్నారు. గతంలో కూడా షర్మిళ ఏపీలో పాదయాత్ర చేసినట్టు గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే షర్మిళను పక్కనబెట్టారని, ఆ కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టిందని చెప్పారు. దీని వల్ల ఆమెకు ఉపయోగం లేదని అన్నారు.

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులోనో, వైఎస్ వివేకా హత్య కేసులోనే జైలుకు వెళ్తారని, అప్పుడు షర్మిళ ఏపీ సీఎం అవుతుందని జోస్యం చెప్పారు. ఏపీకి వెళ్లి పోరాటం చేయాలని కడియం శ్రీహరి సూచించారు. ఇప్పుడు కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జగన్ తర్వాత షర్మిళే సీఎం అవుతుందనడం వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది. కడియం శ్రీహరి వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం షర్మిళ అనే పాయింట్ ఫోకస్ చేయడం ద్వార తెలంగాణలో షర్మిళ వెంట ఉన్నవారిని మానసికంగా దెబ్బతీయొచ్చు. ఆత్మరక్షణలో పడేయవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఒకవేళ జగన్ జైలుకు వెళితే… వైసీపీకి షర్మిళనే దిక్కువుతుందనేది కడియం శ్రీహరి వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థంగా తెలుస్తోంది. అప్పుడు తెలంగాణలో వైస్ఆర్టీపీ మూతపడుతుంది. తెలంగాణలో జెండా పీకేస్తుంది. దీంతో ఆమె వెంట ఉన్నవారు ఒంటరిగా మిగిలిపోతారనేది కడియం వ్యాఖ్యల అంతరార్థం. అదే సమయంలో జగన్ తర్వాత వైసీపీ పై షర్మిళకు మంచి పట్టు ఉంది. గతంలో పాదయాత్ర చేసింది. వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. జగన్ తర్వాతి స్థానం షర్మిళకే ఉంటుంది. పార్టీని నడపగలిగే శక్తి కూడా షర్మిళకు ఉందని చెప్పవచ్చు. వైఎస్ భారతితో పోల్చితే వైఎస్ షర్మిళనే అన్ని విధాలుగా రాజకీయాలకు అర్హురాలు అనే వాదన వైసీపీలో కూడా ఉంది. ఇదంతా జగన్ జైలుకు వెళ్తే జరిగే పరిణామం మాత్రమే.