Honor Killing: పరువు కోసం పెద్దలు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పిల్లల కంటే పరువుకే పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పరువు హత్యలు పెరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం పల్నాడు, అనంతపురం జిల్లా రాప్తాడులో పరువు హత్యలు జరిగాయి. తాజాగా తిరుపతి జిల్లాలో ఐదు నెలల క్రితం జరిగిన పరువు హత్యను పోలీసులు బయట పెట్టారు. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంగా కన్న కూతురిని గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. ఐదు నెలల క్రితం చనిపోయిన యువతి చావు మిస్టరీని ఫోరెన్సిక్ పరీక్షలు బయట పెట్టాయి. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుందని అంత్య క్రియలు పూర్తి చేసిన తండ్రి కర్కశత్వం బయటపెడింది.

ఐదు నెలల క్రితం ఘటన…
చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మోహన కృష్ణ అనే యువతికి ఇంటర్ చదువుతుండగా పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో జులై 7న మోహన కృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు, బంధువులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.
పోలీసులకు సమాచారం..
యువతి మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఇటీవల పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. అందులో మోహన కృష్ణ ఆత్మహత్య చేసుకోలేదని, గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు ఫోరెన్సిక్ నిపుణులు. చనిపోవడానికి ముందు ఆమెకు మత్తు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తండ్రికి సహకరించిన బాబాయ్..
మోహనకృష్ణ తల్లి ఆమె చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో చిన్నప్పటి నుంచి బాబాయ్ కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో పొరుగు గ్రామానికి చెందిన దళిత యువకుడితో ప్రేమ విషయం బయటకు వచ్చింది. దీంతో వివాహం ఇష్టం లేకపోవడంతో తండ్రి, బాబాయ్, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. కూతురి ప్రేమ వ్యవహారాన్ని తట్టుకోలేక తండ్రి మునిరాజా ఇంట్లో హత్య చేసి, ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు..
ఈ వ్యవహారంలో అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గత జులై యువతి హత్య తర్వాత ఆమె ప్రియుడిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడు మోసం చేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా ప్రశ్నించడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి. దళిత యువకుడిని ప్రేమించడంతోనే మోహన కృష్ణ హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది.

యువకుడి ప్రాణం తీసిన అమ్మాయి కుటుంబం
గత జూలైలో అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న జంట… వారికి దూరంగా వేరే ప్రాంతంలో కాపురం పెట్టింది. అయినా వారిని వదిలిపెట్టలేదు. యువకుడ్ని అపహరించి గొంతుకోసి హత్య చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన మురళి, వీణలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాలమ్మ, నాగన్న దంపతుల కుమారుడు మురళి (27) పీజీ తర్వాత పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. డిగ్రీ పూర్తిచేసిన వీణ గ్రామ మహిళా పోలీసుగా ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మురళి, వీణలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసి అభ్యంతరం చెప్పారు. దీంతో గత ఏడాది జూన్‌లో ఇంటిలో నుంచి వెళ్లిపోయిన వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి దంపతులిద్దరూ అనంతపురం జిల్లా రాప్తాడులో నివాసం ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతడ్ని బలవంతంగా లాక్కెళ్లారు. రాప్తాడు మండలం లింగనపల్లి–రామినేపల్లి గ్రామాల మధ్యలో హత్యచేసి పడేశారు. తమ పెళ్లి ఇష్టం లేకనే తన తల్లి భర్తను హత్య చేయించి ఉంటుందని వీణ ఆరోపించింది.
కుటుంబం పరువు తీస్తున్నాడని..
గత జూన్‌లోనే పల్నాడు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరువు తీస్తున్నాడని కన్న కొడుకును తల్లిదండ్రులు హతమార్చారు. మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన 20 ఏళ్ల వెండి గోపి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారులోని పొలంలో శవం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంచిలో మూటగట్టిన శవాన్ని బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరిపారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గోపి అనే యువకుడిని తల్లిదండ్రులే చంపినట్లు గుర్తించారు. జూలాయిగా తిరుగుతూ, అప్పులు చేస్తున్నాడని నిత్యం ఇంట్లో గొడవలు జరిగేవి. ఈక్రమంలో కుటుంబ పరువు తీస్తున్నాడనే కోపంతో రాడ్‌తో కొడుకుపై దాడి చేశారు. ఈ ఘటనలో గోపి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.