
Rajamouli- Mahesh Babu Movie: రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఒకటే… వంద శాతం ఆశించిన ఆడియన్స్ కి రెండు వందల శాతం అనుభూతి ఇస్తారు. రాజమౌళి ప్రతి సినిమాపై అంచనాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇది మైనస్. విపరీతమైన హైప్ ఏర్పడితే బాగున్న చిత్రానికి కూడా నెగిటివ్ టాక్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ రాజమౌళి అలా కాదు, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినా వాటిని అందుకునే సత్తా నాకుంది అంటాడు. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ మూవీ ఆయన నుండి ఇక రాదనుకుంటే ఆర్ ఆర్ ఆర్ తో అందరి మైండ్స్ బ్లాక్ చేశారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ గెలుచుకుంది. ప్రపంచ సినిమా దిగ్గజాలు ఆ చిత్రాన్ని కొనియాడారు. రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్. కాబట్టి ఆయన మీద మరింత బాధ్యత పెరిగింది. రాజమౌళి అప్ కమింగ్ చిత్రాలపై గొప్పగా ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ తో ప్రకటించిన మూవీకి ఆకాశమే హద్దంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను మించిన స్కేల్ లో మహేష్ ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు వేస్తున్నారట. అలాగే ఎంచుకున్న సబ్జెక్టు కూడా ఖర్చుతో కూడుకున్నది.
ఇది ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథ అని చెప్పారు. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని వెల్లడించారు. ఈ క్రమంలో హీరో దేశ దేశాలు తిరుగుతాడట. కాబట్టి కథకు సెట్ అయ్యేలా ఓ హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారట. కెరీర్లో ఫస్ట్ టైం మహేష్ హాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ తో జతకడుతున్నారట. ప్రస్తుతం ఫార్మ్ లో ఉన్న స్టార్ లేడీని కోట్లు కుమ్మరించి తీసుకుంటారట. ఈ మేరకు టాలీవుడ్ లో వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ప్లాన్ చేస్తున్నారట.

మొత్తంగా రాజమౌళి-మహేష్ కాంబోలో ఇండియా గర్వించే మరో చిత్రం రానుందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ కి స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ మహేష్ మూవీకి కూడా స్క్రిప్ట్ సమకూర్చారు. మే లేదా జూన్ నుండి మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. రాజమౌళి చిత్రం కోసం మహేష్ కండలు పెంచి సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ సాధిస్తున్నారట. కనీసం సెట్స్ పైకి కూడా వెళ్లకుండా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఎక్కడికో చేరాయి.