UP Conductor: రెండు నెలల కిందట ఓ బస్సు ముందు కొంత మంది ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కండక్టర్ మానవత్వంతో బస్సును ఆపి.. నమాజ్ చేసుకోడానికి అవకాశం కల్పించాడని ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ కారణంతోనే ఆయనను ఉద్యోగం నుంచి పీకేశారు. ఈ చర్యలతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు.. అప్పటి నుంచి మనో వేదనతో మంచంపట్టాడు. కుటుంబం గడవడం కష్టంగా మారడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై యూపీలో తీవ్ర దుమారం రేగుతోంది.
పిల్లలు నమాజ్ కోసం..
ఉత్తర ప్రదేశ్‌లోని ఘీరోర్‌లోని నాగ్లా ఖుషాలీకి చెందిన మోహిత్ యాదవ్ బరేలీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందట ఢిల్లీకి వెళ్లే బస్సులో విధులు నిర్వర్తిస్తూ.. బరేలీ నుంచి బయలు దేరిన కొద్ది సేపటి తర్వాత వాహనం ఆపించాడు. అనంతరం ఆ బస్సు నుంచి కొందరు ప్రయాణికులు దిగి రోడ్డుపై నమాజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. కండక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అతడ్ని కష్టాలు వెంటాడాయి.
నిరాశతో ఆత్మహత్య..
తీవ్ర నిరాశకు గురైన మోహిత్ రెండు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మోహిత్.. సోమవారం ఉదయం కోస్మా సమీపంలోని రైలు పట్టాలపై శవంగా తేలాడు. దీంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. నమాజ్ కోసం తన కుమారుడు బస్సు ఆపలేదని మోహిత్ తండ్రి రాజేంద్రయాదవ్ వాపోయాడు. ప్రయాణికుల మూత్ర విసర్జన కోసం బస్సును ఆపడంతో కొందరు కిందకు దిగి నమాజ్ చేశారని, ఇందులో మోహిత్ తప్పు లేదని ఎస్‌వో ఘీరోర్ భోలు సింగ్ భాటి తెలిపారు.
ఉద్యోగం పోయి.. కుటుంబం గడవక..
మోహిత్ భార్య రింకు మాట్లాడుతూ.. ఉద్యోగం పోవడంతో తన భర్త తీవ్ర నిరాశకు గురయ్యాడని కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఆయనకు వచ్చే జీతంతోనే ఇల్లు గడిచేది.. ఒక్కడిపై చాలా మంది ఆధారపడ్డాం.. జూన్‌లో జరిగిన సంఘటన తర్వాత నెల నెల వచ్చే రూ.17,000 వేతనం నిలిచిపోయి, కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నాం.. రెండు నెలలుగా ఆయన నిద్రపోలేదు.. నా భర్త తన మానవత్వానికి మూల్యం చెల్లించుకున్నాడు’ అని క న్నీటిపర్యంతమైంది. ఆర్టీసీ అధికారులు, ముఖ్యంగా రీజనల్ మేనేజర్ దీపక్ చౌదరి తన భర్తను పిలిచి అవమానించడానికి.. మోహిత్ మరణానికి అతడే బాధ్యుడని ఆమె ఆరోపించారు.
మత విశ్వాసాల పట్ల బీజేపీ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో, అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో చెప్పే తాజా ఉదాహరణ ఇది. ఇది రాజ్యం చేసిన హత్య అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యూపీలోని బీజేపీ ప్రభుత్వ దారుణాలకు ఇది మరో ఉదాహరణ అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఉద్యోగం తీసేసిన యూపీఎస్‌ఆర్టీసీ, పరోక్ష కారణంగా నిలిచిన బీజేపీ ప్రభుత్వానిదే ఈ తప్పు అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.