Gautam Adani Vs Hindenburg: అపర కుబేరుడు గౌతమ్ ఆదాని సారథ్యంలోని ఆదాని గ్రూప్ కంపెనీలు అప్పుల కుప్పల్లా మారాయంటూ అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇటీవల ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రమోటర్ల మార్కెట్ మాయాజాలంతో చుక్కలను అంటిన ఈ గ్రూప్ కంపెనీల షేర్లు ధరలు కొట్టుకునే ప్రమాదం ఉందని… వాటిలో పెట్టుబడులు ఎంత మాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది..దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మొత్తం కుప్పకూలుతున్నాయి. ఒక్క బుధవారమే గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 55,000 కోట్లు హరించుకుపోయింది. అంతే కాదు హిండెన్ బర్గ్ 88 ప్రశ్నలను అదానీ గ్రూప్ ముందు ఉంచింది. కానీ ఇంత వరకూ అదానీ గ్రూప్ సమాధానం చెప్పలేక పోతోంది. ఈ నివేదికను తప్పుల తడకగా అభివర్ణిస్తున్నది.

అదాని గ్రూప్ పద్దు పుస్తకాలకు నగీషీలు చెక్కడం, స్టాక్ మార్కెట్ మాయాజాలం ద్వారా మార్కెట్ లో ఎడాపెడా అప్పులు తెస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపిస్తున్నది. తన ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు పెంచుకునేందుకు ఆదాని గ్రూప్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, షేర్ల ధరలు అనూహ్యంగా పెంచిందని, ఆ ధరల వద్ద షేర్లను తాకట్టు పెట్టి, ప్రమోటర్లు మరిన్నీ అప్పులు చేస్తున్నట్టు హిండెన్ బర్గ్ చెబుతోంది. దీని వల్ల అదానీ గ్రూప్ లోని ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర 85 శాతం పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నది. గత మూడు సంవత్సరాలు గా అదానీ గ్రూప్ కంపెనీలకు మహర్దశ పట్టడాన్ని బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.
8.19 శాతం పెరిగింది
బర్గ్ తన నివేదికలో ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ ధర సగటున 819 శాతం పెరగడం అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ సూపర్ డూపర్ ర్యాలీ వెనుక ప్రమోటర్ల హస్తం ఉందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ ధరల పెరుగుదల చూపి ఆదానీ గ్రూప్ భారీగా అప్పులు చేసింది. అదానీ గ్రూప్ నెట్ వర్త్ 12,000 కోట్ల డాలర్లు అయితే…ఇందులో పది వేల కోట్ల డాలర్లు ఈ రెండు ఏళ్ళల్లో సమకూరడం విశేషం. ఇక గత ఏడాది మార్చి నాటికి అదానీ గ్రూప్ కంపెనీల అప్పు 2.2 లక్షల కోట్లు..అందులో 40 శాతం ఒక్క ఏడాదిలో పెరగడం గమనార్హం.

ఇక గ్రూప్ ఏక కాల వృద్ది పై హిండెన్ బర్గ్ రెండు ఏళ్ళుగా తవ్వుతున్నది. ఇందుకోసం తీవ్రంగా శ్రమించింది. అర డజను కు పైగా దేశాలను సందర్శించింది. వేలాది డాక్యుమెంట్లను పరిశీలించింది. అదానీ గ్రూప్ మాజీ ఉద్యోగులతో మాట్లాడింది. నివేదిక రూపొందించింది. పన్ను ఎగవేత దారులకు స్వర్గ ధామాలకు ప్రసిద్ది చెందిన కరేబియన్ దీవులు, సైప్రస్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులకు ఉన్న షెల్ కంపెనీల జాడ కూడా బయట పడిందని హండెన్ బర్గ్ చెప్పడం విశేషం.